మునుగోడు ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అసంతృప్త నేత బూర నర్సయ్య గౌడ్ బరిలో దిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన బూర నర్సయ్యకు టీడీపీ అధిష్టానం తాజాగా టచ్ లోకి వెళ్ళిందనే ఊహాగానాలు మునుగోడు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. మునుగోడులో బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని బీసీ సంఘాలు ప్రకటిస్తోన్న నేపథ్యంలో బూర నర్సయ్య కూడా టీడీపీ తరుఫున పోటీ చేసే విషయమై ఆలోచనలో పడినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మునుగోడు టికెట్ ను బీసీలకే కేటాయిస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ దృష్టి సారించింది. టీడీపీకి అక్కడి నుంచి నియోజకవర్గ ఇంచార్జ్ గా కొనసాగుతున్న బీసీ నేతకు అవకాశంఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమైనా… టీఆర్ఎస్ పై అసంతృప్తిగా నున్న బూర నర్సయ్య కు టికెట్ ఇస్తే బీసీ వాదంతో మునుగోడులో నెగ్గుకురావొచ్చునని ఆ పార్టీ సీనియర్ నేతల సూచనతో చంద్రబాబు కూడా ఆలోచనలో పడ్డారట. దాంతో బూర నర్సయ్యకు టచ్ లోకి వెళ్ళినా టీడీపీ అధిష్టానం …ఆయనతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.
అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై పార్టీ మార్పు, టీడీపీ తరుఫున పోటీ చేసే విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటానని బూర నర్సయ్య చెప్పారట. నామినేషన్ దాఖలు చేసేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని త్వరగా చర్చించి తుది నిర్ణయం తెలియజేయాలని టీడీపీ నేతలు సూచించారట. బుధ, గురువారాల్లో బూర నర్సయ్య కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.