ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తనను అవమానించారని చర్లపల్లి టీఆర్ఎస్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కంటతడి పెట్టారు. తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తనకు సమాచారం అందించడం లేదని చెప్పుకొచ్చారు. ఒకే పార్టీకి చెందిన కార్పొరేటర్ , ఎమ్మెల్యే మధ్య వైరం తారాస్థాయికి చేరడంతో ఇష్యూ మరింత పెద్దదైంది.
వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ టికెట్ ను ఆశిస్తున్నారు బొంతు శ్రీదేవి భర్త, మాజీ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా వర్గాన్ని కూడా తయారు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ కే చెందిన బేతి సుభాష్ రెడ్డి కొనసాగుతున్నా బొంతు రామ్మోహన్ మాత్రం పండగలు, ఎవైనా కార్యక్రమాలు ఉంటె తనప్లెక్సీలు నియోజకవర్గం అంతటా వేసుకొని హడావిడి చేస్తున్నారు. ఆయన హంగు ఆర్భాటం బేతి సుభాష్ రెడ్డికి ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇద్దరి నేతల మధ్య వైరం ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో చర్లపల్లి డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్ శ్రీదేవికి సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యే పాల్గొన్నారు. దీనిపై ఆమె ఎమ్మెల్యేను ప్రశ్నించగా కులం పేరుతో దూషించారని.. స్థానికేతరులు మీకెందుకు ఇక్కడ రాజకీయాలంటూ మాట్లాడారని బొంతు శ్రీదేవి మీడియా ముందు ఫైర్ అయింది. బేతి – బొంతుల రాజకీయంలో మంత్రి కేటీఆర్ బొంతు రామ్మోహన్ కు అనుకూలంగా ఉన్నారని.. అందుకే ఎమ్మెల్యేను ఏమాత్రం పట్టించుకోకుండానే బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారని.. అందుకే ఆయన భార్య ఏమాత్రం తగ్గకుండా మీడియా ఎదుటే ఎమ్మెల్యేను ఎకిపారేసిందన్న చర్చ జరుగుతోంది.