మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలో నిలపాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తోంది. మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయకపోతే అప్పటికప్పుడు అభ్యర్థిని ఫిక్స్ చేయడం ఇబ్బంది అవుతుందని హైకమాండ్ గ్రహించింది. ఇందుకోసం కేసీఆర్ ముందస్తుగా ప్లాన్ బీ కూడా రెడీ చేసి ఉంచుతున్నారు.
హరీష్ రావుపై మైనంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడం వెనక హరీష్ ఉన్నారని ఎకిపారేశారు. ఇది బీఆర్ఎస్ లో ఓ అలజడిని సృష్టించింది. కేటీఆర్ , కవితలు మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. అయినప్పటికీ మైనంపల్లిపై ఎలాంటి సస్పెన్షన్ వేటు వేయలేదు. ఆయన మాత్రం తనతోపాటు ఆయన కుమారిడికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇద్దరికీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మైనంపల్లి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మల్కాజిగిరిలో మైనంపల్లి బలమైన నేతగా ఉన్నారు. అందుకే ఆయనపై చర్యలకు బీఆర్ఎస్ వెనకడుగు వేస్తోంది. చివరి నిమిషం వరకు వేచి చూసి ఆ తరువాత కూడా మైనంపల్లి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే బొంతు రామ్మోహన్ ను పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులు సమావేశమై బొంతు రామ్మోహన్ కు ఈమేరకు సమాచారం అందించినట్లు సమాచారం.
మల్కాజిగిరి నుంచి మొదట ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును పోటీ చేయాలనీ కోరారు. కానీ ఆయన మాత్రం తనకు కుత్బుల్లాపూర్ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని.. మల్కాజిగిరి నుంచి పోటీ చేసే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పినట్లు సమాచారం. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జ్ గానున్న మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పేరును పరిశీలించారు. కానీ ఒకే కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు ఇస్తే బాగోదు అని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
అన్ని అంశాలను పరిశీలించి..ఇదివరకు మేయర్ గా పని చేసి, ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తోన్న బొంతు రామ్మోహన్ కు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. రామ్మోహన్ మొదట ఉప్పల్ సీట్ ఇవ్వాలని కోరారు. కానీ అక్కడ మరో నేతకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మల్కాజిగిరి సీట్ ఇస్తామని చెప్పడంతో ఆయన కూడా ఖుషీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : బిగ్ న్యూస్ – తన వర్గం నేతలతో కాంగ్రెస్ లోకి హరీష్ రావు..?