ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ కర్ణాటకలో బీజేపీ గ్రాఫ్ డమాల్ మంటోంది. ఇప్పటికే ఆ పార్టీని అరవై మంది నేతలు వీడారు. ఈ ఒక్క ఉదంతం చాలు. కర్ణాటకలో బీజేపీ గెలుపుపై ఆ పార్టీ నేతలకు నమ్మకం ఎంత సన్నగిల్లిందో చెప్పేందుకు. కాంగ్రెస్ లోకి పెరుగుతోన్న చేరికలను చూసి కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమని పోలింగ్ కు ముందే ఓ అంచనాకు వస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ హవా కొనసాగిన సమయంలోనూ కర్ణాటక కాంగ్రెస్ లో ఈస్థాయి చేరికలు లేవు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీనే కొనసాగుతున్నా..కర్ణాటక ఎన్నికలపై అమిత్ షా , జేపీ నడ్డాలు ఫోకస్ చేస్తున్నా ఆ పార్టీని వీడే నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయా పార్టీలను వీడుతోన్న నేతలంతా తమ రైట్ ఛాయిస్ గా కాంగ్రెస్ నే ఎంచుకుంటున్నారు. కాంగ్రెస్ గెలుపుపై నమ్మకం కల్గుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు కూడా కిమ్మనకుండా ఉండిపోతున్నారు. టికెట్ కోసం పక్క పార్టీల వైపు చూస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర పరిణామాలను గమనిస్తుంటే స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ తో కర్ణాటక కాంగ్రెస్ వశం కావడం పక్కా అనేది స్పష్టం అవుతోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తథ్యమని సర్వే ఫలితాలు వస్తుండటంతో ఇతర పార్టీలోని కీలక నేతలు, టికెట్ దక్కని ప్రస్తుత ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ లో టికెట్ దక్కకపోయినా పరవాలేదు.. అధికారంలోకి వస్తే ఎదో ఒక పదవి దక్కకపోదా అనే ఆలోచనతో కాంగ్రెస్ లో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇదిలావుంటే మాజీ ముఖ్యమంత్రి, బీజేపీని రాష్ట్రంలో విస్తరించిన జగదీశ్ శెట్టర్ కూడా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన కనీసం 24 గంటలు కూడా కాకుండానే ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
లింగాయత్ సామజిక వర్గానికి చెందిన జగదీశ్ శెట్టర్ ను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు కేపీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ , మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు ప్రత్యేక వ్యూహం రచించి ఆయన్ను కాంగ్రెస్ లో చేరేలా చొరవ చూపారు. కర్ణాటకలో బలమైన ఓటు బ్యాంక్ కల్గిన లింగాయత్ సామజిక వర్గం. ఈ సామజిక వర్గానికి చెందిన జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ లో చేరడంతో ఆ సామజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ ఖాతాలోకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. బీజేపీని అంచెలంచెలుగా అభివృద్ధి చేసిన జగదీశ్ శెట్టర్ వంటి నేతలకు కేంద్ర బీజేపీ నేతలు టికెట్ ఇవ్వకపోవడంతో కర్ణాటకలో ఓటమికి బీజేపీ దారులు వెతుక్కుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : బిగ్ న్యూస్ : కాంగ్రెస్ లోకి 45మంది నేతలు – ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!