తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడటం సాధ్యం కాదని అనుకున్నారు. కాని తెలంగాణలో ఊహించని విధంగా బీజేపీ బలపడుతుండటంతో ఏపీలోనూ పార్టీ ఎదుగుదలపై అగ్రనేతలు ఫోకస్ చేస్తున్నారు. ఇందుకోస ఒంటరిగానే ఏపీలో బలపడాలని అనుకుంటున్నారు. పొత్తులతో బీజేపీకి ఆశించిన లాభం చేకూరడం లేదని అందుకే పొత్తులకు ముగింపు పలకాలని అగ్రనేతలు భావిస్తున్నారు.
తాజాగా ఏపీలో పొత్తులు అవసరం లేదనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనతో పొత్తు ఉన్నా.. ఆ పార్టీ బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదు. పక్క పార్టీల నేతలను ముఖ్యమంత్రి చేస్తామని బతిమాలాల్సిన అవసరం ఏముందనే ఆలోచనతో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఇక ఏపీలో పొత్తులు లేకుండానే బలపడాలని స్కెచ్ గీస్తున్నారు కమలనాథులు.
పొత్తుల్లేకుండానే సాగాలని ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీ నేతలకు హైకమాండ్ స్పష్టం చేయడంతో.. సోము వీర్రాజు కూడా ఇదే విషయమై మాట్లాడారు. ఇక రాష్ట్రంలో పొత్తుల చర్చ ఉండదని ప్రకటించారు. కాని సోము కామెంట్స్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
పొత్తుల వలన బీజేపీనే ఎక్కువ నష్టపోతుందనే భావన అగ్రనేతల్లో ఉంది. జనసేనతో పొత్తు ఉన్నా.. జనసేననే పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్లు కవరింగ్ ఇస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇది జాతీయ పార్టీగా బీజేపీ ఇమేజ్ ను దేబ్బతీసేదే. అందుకే జనసేనతో కటీఫ్ చెప్పేసి సొంత ఎదుగుదలపై దృష్టి పెట్టాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో సందేశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
గతంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం వలెనే ఆశించిన మేర పార్టీ ఎదగలేదని అభిప్రాయంతో జాతీయ నాయకత్వం ఉంది. బీజేపీతో పొత్తుపై జనసేనే అనాసక్తిగా ఉన్నందున.. తాము బతిమాలడటం బాగుండదన్న ఆలోచనకు వస్తున్నారు.
ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అధిష్టానం నిర్ణయం పై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్ మరింత స్పష్టత ఇవ్వనున్నారు. పొత్తులను పక్కనబెట్టి సొంత ఎదుగుదలపై దృష్టిసారించాలంటూ అధిష్టానం నుంచి స్పష్టత వచ్చినందున ఏపీ బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది.
జనసేనతో పొత్తుకు బీజేపీ ఎండ్ కార్డు వేస్తె..టీడీపీతో జనసేన పొత్తుకు లైన్ క్లియర్ అయినట్లే. కాని సీట్ల సర్దుబాటు విషయంలో పొత్తుల అంశం ఎటు కాకుండా పోతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.