తెలంగాణలోనూ ఎక్ నాథ్ షిండే లు పుట్టుకొస్తారని బీజేపీ నేతల ప్రకటనలతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఈ విషయంలో బీజేపీకి కౌంటర్ ఇచ్చిన కేసీఆర్ పలువురు కీలక నేతలపై కన్నేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు బీజేపీ, కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని నిఘా వర్గాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పీకే సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టీఆర్ఎస్ టికెట్లు ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఈసారి 30 మంది సిట్టింగ్ లకు నిరాశ తప్పదని తెలుస్తోంది. అందులో భాగంగా ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతోన్నా సీఎం సాబ్ కరుణించడం లేదట. పార్టీలో ఉంటే ఉండండి.. లేదంటే వెళ్ళండనే విధంగా పక్కకు పెడుతుండటంతో .. ఇదే అదునుగా భావించిన కమలం క్యాంప్ కొంతమంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు షురూ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలంగాణలోనూ ఎక్ నాథ్ షిండేలు వస్తారని కామెంట్స్ చేశారని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. రాజకీయ పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉన్న బీజేపీ అధినాయకత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అరడజను ఎమ్మెల్యేలు ( టికెట్ నిరాకరణ) జాబితాలోనున్న ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు షురూ చేసిందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు…కేసీఆర్ కూడా నిఘా వర్గాల ద్వారా పరిస్థితిని ఓ కంట కనిపెడుతున్నారని అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.