తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ మధ్య తెగ ఆసక్తి చూపిన టి. బీజేపీ ఎంపీలు ప్రస్తుతం వెనక్కి తగ్గారా..? ఓటమి భయంతోనే నలుగురు ఎంపీలతోపాటు సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల పోటీపై పునరాలోచనలో పడ్డారా..? లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రమే వారు ఆసక్తిగా ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు, సీనియర్ నేతలను పోటీ చేయించాలని అధినాయకత్వం భావించింది. ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలను బరిలో నిలిపి అధిక సీట్లను గెలుచుకోవచ్చునని పశ్చిమ బెంగాల్ చేసిన ప్రయత్నం ఫలించడంతో.. ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేయాలనుకున్నది. ఇందుకు సదరు నేతలు కూడా అంగీకారం తెలిపారు. కిషన్ రెడ్డి – అంబర్ పేట్, ధర్మపురి అరవింద్ – ఆర్మూర్, సోయం బాపురావు – బోథ్ , బండి సంజయ్ – కరీంనగర్ లేదా వేములవాడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ – ముషీరాబాద్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ కొద్ది రోజులుగా తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఈ నేతలంతా పోటీపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటె తీవ్ర పరాభవం ఎదుర్కోవాల్సి వస్తుందని.. పోటీపై బీజేపీ నేతలు పునరాలోచనలో పడినట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ అవుతుందని..అదంతా తమ పార్టీ క్రెడిట్ అని బీజేపీ నేతలు బలంగా చెప్పుకున్నారు. అరెస్ట్ అవుతుందనుకున్న కవిత అరెస్ట్ అవ్వలేదు. పైగా.. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ అధినాయకత్వంతో సహా రాష్ట్ర నాయకత్వం సాఫ్ట్ గా వ్యవహరిస్తుండటంతో రెండు పార్టీలు ఒకటేనని ప్రచారం కాంగ్రెస్ జనాల్లోకి తీసుకు వెళ్ళింది. జనాలు కూడా దీనిని గుర్తించినట్టు ఉన్నారు. అందుకే పలు సర్వే సంస్థలు చేస్తోన్న ఫలితాల్లో బీజేపీ ఎమ్మెల్యేలుగా డబుల్ డిజిట్ దాటరని స్పష్టం చేస్తున్నాయి. తమకు అసెంబ్లీ ఎన్నికలు గండంగా పరిణమించాయని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధినాయకత్వం మాట విని పోటీలో ఉంటె..ఓటమి ఖాయమని సన్నిహితుల వద్ద గోడును వెళ్ళబోసుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందనుకుంటున్నారు. మోడీ ఇమేజ్ తో లోక్ సభ ఎన్నికల్లో నెగ్గవచ్చునని.. ప్రస్తుతం పార్టీకి అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఓపెన్ గానే ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందుకే పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం బదులు.. మోడీ చరిష్మాతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని నమ్ముతున్నారు. అందుకే సీనియర్ నేతలు పోటీ చేసేందుకు దరఖాస్తులను సమర్పించలేదని టాక్ నడుస్తోంది.
Also Read : ఈటల సన్నిహితుల పక్కచూపులు – ఆ ఇద్దరూ మోసపోయారా.?