ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు ప్రగ్యా ఠాకూర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. హిందువులంతా కత్తులు రెడీ చేసుకోవాలంటూ ఆమె చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
హిందువులంతా తమను తాము రక్షించుకునేందుకు పదునైన కత్తులను ఇంట్లో ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లో ఊరికే ఉంచుకోవడం కాదు..అవి పదునుగా ఉన్నాయో లేదో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు. శివమోగ్గలో జరుగుతోన్న హిందూ జాగరణ్ మంచ్ దక్షిణ ప్రాంత సదస్సులో ఆమె మాట్లాడారు. మనపై జరిగే దాడులను ఎదుర్కోవడం మన హక్కు అంటూ చెప్పుకొచ్చారు.
లవ్ జిహాదీ వారికీ ఓ సంప్రదాయం ఉంటుంది. హిందువులూ ప్రేమిస్తారు. అయితే వారు దేవుడిని ప్రేమిస్తారు. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని చెబుతారు. లవ్ జిహాదీ ప్రయోగించే వాళ్ళకు అదే పద్ధతిలో ఆన్సర్ ఇవ్వాలి. దేవుడు సృష్టించిన ఈ లోకంలో పాపాత్ములున్నారని .. వారిని అంతం చేయాలని లేదంటే ప్రేమకు సరైన అర్థం చెప్పలేమన్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పలేం. అందుకే ఇంట్లోని ఆడ పిల్లలను రక్షించుకునేందుకు ఎథిక్స్ నేర్పాలి. కొంతమంది అరాచక శక్తుల నుంచి కాపాడుకునేందుకు, వ్యక్తిగత రక్షణ కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో కత్తులు ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఒకవేళ ఎలాంటి దాడులు జరగనట్లైతే వాటిని కూరగాయల కటింగ్ కోసం వాడాలని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మైనార్టీ సంఘాల నాయకులు ప్రగ్యా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తక్షణమే ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.