తెలంగాణ బీజేపీలో నైరాశ్యం కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడం…ఆ తరువాత చేరికలు ఉంటాయని ప్రచారం చేసుకున్నా.. పేరున్నా నేతలు ఎవరూ పార్టీలో చేరలేదు. దీంతో పార్టీలో ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది. అయితే.. ఆ నిస్తేజాన్ని తొలగించేందుకు బీజేపీ నేతలు కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు.
ప్రధాని మోదీని తెలంగాణ నుంచి పోటీ చేయమని కోరుతారట. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మహబూబ్ నగర్ లో సోమవారం నుంచి జరగనున్నాయి. ఈ సమావేశంలో మోడీ పాలమూరు నుంచి పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి అగ్రనేతలకు పంపించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడం..ఎన్నికలను ఎదుర్కోవడం.. ప్రజా సమస్యలపై ఉద్యమించడం వంటి అంశాలపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. అయితే..తెలంగాణపై అగ్రనాయకత్వం ఫోకస్ చేసినా.. పార్టీ అనుకున్నంత రేంజ్ లో పుంజుకోలేదు. కాబట్టి…మోదీని తెలంగాణ నుంచి పోటీ చేయించడం ద్వారా పార్టీకి బలం వస్తుందని బీజేపీ నేతలు అనుకుంటున్నారు.
ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రధాని మోడీని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కోరినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పాలమూరు నుంచి ప్రధాని పోటీ చేయడం వలన తెలంగాణపైనే కాకుండా దక్షిణాదిపై ఫోకస్ చేసేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇదంతా అగ్రనాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తెలంగాణ బీజేపీ నేతలు ఆడుతున్న ఆట అని.. మోదీ , షాలు పోటీ చేయడం సాధ్యం కాదని వారికీ తెలుసని ఇతర బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.