ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు ఏదైనా రాష్ట్రంపై టార్గెట్ చేశారంటే ఆ రాష్ట్రాన్ని వశపరుచుకునే వరకు అస్సలు వెనక్కి తగ్గరు. అధికారం కోసం ఏమేం చేయాలనే విషయాలపై రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటారు. అధికారం కోసం మొదట కీలక నేతలతో సంప్రదింపులు జరిపుతారు. విన్నారా…?సరేసరి. లేదంటే చిన్న లూప్ హోల్స్ దొరికినా అస్సలు వదలరు.
అస్సాం కాంగ్రెస్ కు గతంలో నాయకత్వం వహించిన హిమంత బిశ్వ శర్మ లూప్ హోల్స్ పట్టుకొని రాజకీయంగా బెదిరించారు. ఈడీ, సీబీఐ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసి వేధించారు. ఆ తరువాత సీఎం సీట్ ఆఫర్ చేసి బీజేపీలో చేర్చుకున్నారు. తీరా బీజేపీలో చేరాక ఆయనపై ఉన్న కేసులు ఏమయ్యాయో బీజేపీ నేతలకు కూడా తెలియదు. నాడు టీడీపీ రాజ్యసభ సభ్యుల విషయంలోనూ ఇదే జరిగింది. కేసుల భయంతో వారు బీజేపీలో చేరగానే ఆ కేసుల జాడ లేకుండా పోయింది. అంటే.. కేసులున్న నేతలు బీజేపీలో చేరగానే సచ్చీలురు అవుతారా..? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా కేంద్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో 95శాతం ప్రతిపక్ష నాయకులు, వారి బంధువులు, సన్నిహితల మీదే నమోదు అయ్యాయి. నమోదైన కేసుల్లో రుజువైనవి కేవలం 0.46శాతం మాత్రమే. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు బీజేపీ కక్ష సాధింపు చర్యలు ఎలా ఉంటాయో. కేసులు నమోదై..దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించిన తరువాత కేసులు ఎదుర్కొన్న నేతలు బీజేపీ తీర్ధమో, బీజేపీ డైరక్షన్ లో పని చేయడమో చేస్తే…ఆ కేసుల ముచ్చటే లేకుండా పోతుంది.
ఈ తొమ్మిది సంవత్సరాలలో ఈడి 121 మంది ప్రతిపక్ష నాయకులపై 115 కేసులు నమోదు చేసింది. సీబీఐ 124 కేసులు నమోదు చేసింది. ప్రతిపక్ష నాయకుల పైనే 118 కేసులు నమోదు చేయడం విశేషం. పి ఎం ఎల్ ఏ తదితర సెక్షన్ల కింద ఈడి 5,422 కేసులు నమోదు చేసింది. ప్రతిపక్ష నాయకులపై 5,150 కేసులు నమోదు చేసింది. ఇందులో శిక్ష పడ్డవారు లేదా రుజువైన కేసులు కేవలం 25 మంది మాత్రమే. ఇక 10 సంవత్సరాల యూపీఏ హయాంతో పోలిస్తే, తొమ్మిదేళ్ళ బిజెపి పాలనలో బీజేపీయేతర పార్టీల నేతలపై 27 రేట్లు ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం.
కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ డైరక్షన్ లోనే పని చేస్తున్నాయనేది సుస్పష్టం. బీజేపీకి ప్రతి విషయంలో అండగా నిలుస్తోన్న జగన్ ను మాత్రం ఈ దర్యాప్తు సంస్థలు టచ్ చేయడం లేదు. ఆయన లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. గతంలో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. ఇలా అవినీతి ఆరోపణలు ఉన్నా జగన్ ను టార్గెట్ చేసి జైల్లో వేయాలనుకుంటే బీజేపీకి అదేమంత పెద్ద పనేం కాదు. కాని ఎందుకు ఆపని చేయడం లేదో అందరికీ తెలుసు. బీజేపీకి కావాల్సిన సమయంలో జగన్ ఎలా ఆడటానికైనా సిద్దం కనుక ఆయన జోలికి వెళ్ళడం లేదని అంటున్నారు.
ఢిల్లీలో బీజేపీని చిత్తూచేసి రెండుసార్లు ఆప్ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇది రుచించని బీజేపీ మనిష్ సిసోడియాను కమలం పార్టీలోకి ఆహ్వానించింది. బీజేపీలో ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించడంతో బీజేపీకి కోపం వచ్చింది. దీంతో ఆయన లూప్ హోల్ ను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేయించింది. ఇకపోతే.. ప్రధానిని వ్యక్తిగతంగా విమర్శించడం..జాతీయ రాజకీయాలంటూ మోడీకి కేసీఆర్ పోటీ రావడంతో కేసీఆర్ కూతురిని టార్గెట్ చేశారు. వీరు తప్పు చేయకుండానే ఈ కేసులో ఇరికించారని అనడటం లేదు. ఈ కేసును ముందుంచి బీజేపీ ప్రయోజనాలను నెరవేర్చలేదని ఆగ్రహంతోనే ఈ కేసును వాడుతూ వారిని టార్గెట్ చేస్తున్నట్టు అర్థం అవుతోంది.
కేటీఆర్ ను సీఎం చేయాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు.దాంతో కవిత అసంతృప్తిగా ఉన్నారని…ఆమె ద్వారా తెలంగాణలో బలపడాలని అమిత్ షా స్కెచ్ గీశారు. ఇందుకోసం కవితను బీజేపీలోకి ఆహ్వానించారని… ఆమె తిరస్కరించడంతో లిక్కర్ స్కామ్ కేసుతో కవితను వేధిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే… రాజకీయంగా తమతో విబేధిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది బీజేపీ రాజకీయ ప్రత్యర్ధులకు సినిమా చూపిస్తుందనేది క్లియర్ గా అర్థం అవుతోంది.