వివేక్ , ఈటల రాజేందర్ ల పైసల పంచాయితీ ఎపిసోడ్ పై బీజేపీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇద్దరు నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకే పార్టీకి చెందిన నేతలు అందరూ చూస్తుండగానే పైసల కోసం పంచాయితీ పెట్టుకోవడం… అందులోనూ క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ఆ ఇద్దరి నేతల తగువులాట చర్చనీయాంశం అయింది. పార్టీ పరువు తీశారని ఈ ఇద్దరంటే గిట్టని నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో వివేక్ నుంచి ఈటల 10కోట్లు తీసుకున్నారు. ఒప్పందంలో భాగంగా ఉప ఎన్నిక ముగియగానే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఉప ఎన్నిక ముగిసి ఏడాది అయిపోయినా ఇంతవరకు వివేక్ కు ఇస్తానన్న 10కోట్లు ఇవ్వలేదు. ఎన్నిసార్లు వివేక్ పీఏ ఫోన్ చేసినా ఈటల స్పందించకపోవడంతో.. ఇక వివేకే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయమై మాట్లాడితే.. డబ్బులు అడ్జస్ట్ చేయలేను కాని, 10కోట్లకు బదులుగా అంతే మొత్తంలో విలువైన స్థలం రాసిస్తానని హామీ ఇచ్చారట ఈటల. అందుకు వివేక్ కూడా ఒకే చెప్పారట. ఈ హామీ ఇచ్చి కూడా నెలలు గడిచిపోవడంతో మళ్ళీ ఈటలకు ఇటీవల వివేక్ ఫోన్ చేసినా స్పందించలేదట.
ఇస్తానన్న పైసలు ఇవ్వలేదు. ఆ తరువాత చెప్పిన స్థలం కూడా రాసివ్వకపోవడంతో వివేక్ కు మండిపోయిందట. ఈ క్రమంలోనే వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈటల కంటపడటంతో వివేక్ నిలదీశారు. పైసలు ఇవ్వవు.. స్థలం ఇవ్వవు.. పైగా ఫోన్ చేస్తే స్పందించవు. ఇదేనా నీ మర్యాద అంటూ అందరి ముందే ఈటలను వివేక్ నిలదీయడంతో అవమానంగా భావించారట. ఎక్కడి పైసలు..? ఏం మాట్లాడుతున్నావ్..?పార్టీ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఎలా ఇస్తారు..? అడగడానికి సిగ్గుందా..? అని ఈటల అనడంతో వివేక్ ఆగ్రహానికి లోనయ్యారట. దాంతో ఇద్దరు మధ్య మాటా, మాట పెరిగి చొక్కాలు పట్టుకునే వరకే వెళ్లిందట. అక్కడే ఉన్న కొంతమంది నేతలు వారిని పక్కకు తీసుకెళ్ళడంతో అటు నుంచి అటుగా ఈటల జంప్ అయ్యారట.
అయితే.. పార్టీలో ఈటల తెరచాటుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడని.. వివేక్ – ఈటల పైసల పంచాయితీ అంశాన్ని పార్టీలో ఆయన వ్యతిరేకులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళారట. జరిగిన సంఘటనను పూర్తిగా వివరించడంతో ఈటలపై అగ్రనేతలు సీరియస్ అయ్యారట. ఒప్పందం ప్రకారం తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకుండా ఇలా చేయడం సరైంది కాదని.. పార్టీ పరువును బజారుకీడ్చేలా చేస్తే సీరియస్ యాక్షన్స్ ఉంటాయని హెచ్చరించారట నేతలు.