ఆశ ఉండాలే కాని అత్యాశ ఉండకూడదని చెప్తుంటారు పెద్దలు. ఎందుకంటే ఉన్నది కాస్త ఉడుసుకుపోతుందని. అందుకే ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలని పదేపదే చెబుతుంటారు. ఈ విషయాన్ని ఏ ఒక్క దానికో పరిమితం చేసి చూడలేం. అన్నింటికీ వర్తిస్తుంది. రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని ముందుకు సాగితే ప్రయోజనాలు ఉంటాయి. కానీ అత్యాశకు లోనైతే బొక్కబోర్లాపడతారు. నవ్విన వాళ్ళ ముందు జరిపడుతారు. ఇప్పుడు వైసీపీ రాజకీయం అట్టాగే మారింది.
2019 ఎన్నికల్లో వైసీపీకి 151స్థానాలు దక్కడంతో వచ్చేఎన్నికల్లో 175స్థానాల్లో పాగా వేయాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకునే సమయం సమీపిస్తోందని వెటకారంగా…వ్యంగ్యంగా వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆరునూరైన వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.
ఇందులో భాగంగా కుప్పంలో వైసీపీ పాగా వేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వాడుకొని చంద్రబాబు ఇలాకాలో వైసీపీ జెండా ఎగరేయగలిగారు. వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకొని సాధించిన విజయం ఓ విజయమేనా..? వైసీపీ నేతలే ఆత్మవిమర్శ చేసుకోవాలి.
స్థానిక సంస్థల్లో గెలుపొందటంతో కుప్పంపై కాన్సన్ ట్రేషన్ మరింత పెంచింది వైసీపీ. ప్రత్యర్ధి ఇలాకాలో విజయం సాధించాలని కోరుకోవడం తప్పేమీ కాదు. కానీ పరిమితులకు లోబడి రాజకీయం చేయాలి. చంద్రబాబు – వైఎస్సార్ లు రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్నప్పటికీ వారు ఏనాడూ గీత దాటి వ్యవహరించలేదు. కానీ జగన్ మాత్రం పరిమితులను మించి రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీని బలహీనపరుస్తోంది.
చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో కుప్పంపై కాన్సన్ ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసి పులివెందులపై ఫోకస్ తగ్గించారు జగన్. ఇదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమైనట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జగన్ ఇలాకా పులివెందులలో టీడీపీకి రెండు వేల మెజార్టీ వచ్చింది.
కుప్పంపై ఎక్కువ దృష్టి పెట్టడం మానేసి పులివెందులపై ఫోకస్ చేసి ఉంటె జగన్ సొంత నియోజకవర్గంలో వైసీపీకి ఈ దుస్థితి వచ్చేది కాదు. దీనిని టీడీపీ అడ్వాంటేజ్ గా తీసుకొని జగన్ పై చెలరేగిపోతోంది. కుప్పం కొట్టడం మానేసి ముందు పులివెందులలో జగన్ ఓటమి పాలు కాకుండా చూసుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.
Also Read : క్యాబినెట్ నుంచి నలుగురు అవుట్ – మరి జగన్ సంగతేంటి..?