ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అభ్యర్థిని మార్చాలని లేదంటే సుధీర్ రెడ్డి ఓటమి కోసం పని చేస్తామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ రామ్మోహన్ గౌడ్ అధిష్టానానికి అల్టిమేటం విధించారు. మంగళవారం ఎల్బీనగర్ లో పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కు హెచ్చరికలు పంపారు రామ్మోహన్ గౌడ్.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నేతకు అవకాశం ఇచ్చి…పార్టీ ఎదుగుదల కోసం పని చేస్తున్న సొంత పార్టీ నేతలను పక్కనపెట్టడం సరైంది కాదన్నారు. సుధీర్ రెడ్డి అభ్యర్థిత్వంపై కేసీఆర్ , కేటీఆర్ పునరాలోచించాలని కోరారు. లేదంటే సుధీర్ రెడ్డిపై పోటీకి లక్ష్మీ ప్రసన్నను నిలబెడుతామని హెచ్చరించారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ .. భౌతిక దాడులు చేయిస్తున్న ఎమ్మెల్యే కోసం పని చేసేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు రామ్మోహన్ గౌడ్.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రామ్మోహన్ గౌడ్ బలమైన నేతగా ఉన్నారు.2014,18ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన రామ్మోహన్ గౌడ్.. ఈసారి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి గెలవాలనుకున్నారు. కానీ టికెట్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సుధీర్ రెడ్డికి ఇవ్వడంతో రామ్మోహన్ గౌడ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి హైకమాండ్ కు హెచ్చరికలు పంపారు.
Also Read : బీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ – లేటెస్ట్ సర్వే రిజల్ట్ ఇదే..!!