బీఆర్ఎస్ నేతల పిల్లల కోసమే గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ అయిందా..? ఈ పేపర్ లీకేజీ వెనక మంత్రి కేటీఆర్ హస్తముందా..? అంటే అవుననే అంటున్నారు బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్.
బీఆర్ఎస్ నేతల పిల్లల కోసమే గ్రూప్-1 క్వశ్చన్ పేపర్లను లీక్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఇది నమ్మడానికి కొంత కష్టంగానే ఉన్నా కొన్ని విషయాలను బయటకు తీసుకురావడంతో దీనిని కొట్టిపారేయడానికి వీలు లేకుండా పోయింది. అదేమంటే…జగిత్యాల జిల్లాలోని ఒక మండలంలోనే గ్రూప్-1 రాత పరీక్షల్లో 50 మంది క్వాలిఫై అయ్యారట. అలాగే చిన్నగ్రామంలో ఆరుమంది ఎలా క్వాలి ఫై అవుతారని బండి అనుమానం వ్యక్తంచేశారు.
జగిత్యాల మండలంలోని నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతో పాటు జడ్పీటీసీ బాడీగార్డుగా పనిచేసే వ్యక్తి కొడుకు కూడా గ్రూప్ 1 పరీక్షలో పాసైనట్లు చెప్పారు. ప్రశ్నాపత్రం లీక్ కావడంతోనే బీఆర్ఎస్ నేతల పిల్లలు గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లు బండి సంజయ్ చెప్తున్నారు. అధికార పార్టీ నేతల కుమారులు ఈ గ్రూప్ 1ఎగ్జామ్ లో అర్హత సాధించడం వెనక మంత్రి కేటీఆర్ హస్తముందని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. కేటీఆర్ సన్నిహుతుడి ద్వారానే ఈ లీకేజీ జరిగిందన్నారు.
ఈ ప్రశ్నాపత్రం ఇచ్చేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి 5లక్షలు వసూళ్లు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు బండి సంజయ్. ఈ విషయం తెలియడంతోనే కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.ఈ పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నలో పని చేసే సిట్ తో విచారణ జరిపితే ఫలితం ఉండదని అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు బండి సంజయ్.
గతంలో డ్రగ్స్ కేసును ఎలాగైతే నీరుగార్చారో ఇప్పుడు ఈ లీకేజీ వ్యవహారాన్ని కూడా అలాగే నీరుగార్చాలని ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ నుద్దేశించి ఆరోపించారు. ఈ సంఘటనపై తాము ఓ కమిటీని ఏర్పాటు చేశామని తొందర్లో ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని అది వచ్చాక.. పేపర్ లీకేజీలో ఎవరెవరి ప్రమేయం ఉందొ తేలుతుందని చెప్పారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకైతే బీఆర్ఎస్ నేతల పిల్లల కోసమే ఈ పేపర్ లీకేజీ జరిగినట్లు తెలుస్తోందన్నారు.
Also Read : టీఎస్ పీస్సీ పేపర్ లీకేజీలోనూ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం..?