పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చివేస్తె తప్పేంటని ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుండగానే.. నూతన సచివాలయంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోములు కూల్చివేస్తామని వ్యాఖ్యానించారు.
తెలంగాణ నూతన సచివాలయం భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదని బండి సంజయ్ విమర్శించారు. తాజ్ మహల్ తరహాలో ఉన్న సచివాలయ డోములు తెలంగాణ సంస్కృతికి భిన్నంగా ఉన్నాయని…వాటిని కూల్చి, తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం అధినేత ఒవైసీ కళ్ళలో ఆనందం కోసమే తాజ్ మహల్ నమూనాతో కొత్త సచివాలయాన్ని కేసీఆర్ నిర్మించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతిని వదిలేసి తాజ్ మహల్ నమూనాతో సచివాలయ డోమ్ లను నిర్మించారని మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్ రోడ్డు పక్కన ఉన్న గుళ్ళు, మసీదులు కూల్చుతామని చెబుతున్నారని..కేటీఆర్ కు దమ్ముంటే ముందు ఆ కూల్చివేతలను పాతబస్తీ నుంచి మొదలు పెట్టాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఒవైసీని సంతృప్తిని పరిచేందుకు కేసీఆర్ కొత్త సచివాలయ డిజైన్ ఎంపిక చేశారని సంజయ్ ఆరోపించారు.
650 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. ఇదంతా ప్రజల సొమ్ము తగలేసి కట్టారు. ఇప్పుడు హిందూ మత సంప్రదాయాలకు విరుద్దంగా ఉందని… కూల్చివేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సచివాలయం డోమ్ లు తాజ్ మహల్ నమూనాను ప్రతిబింబించేలా ఉన్నాయని అంటున్నారు. తాజ్ మహల్ ను ప్రతిబింబించేలా ఉంటె నష్టమేంటి..? ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన తాజ్ మహల్ నమూనాతో సచివాలయ డోమ్ లుంటే తప్పేంటి..? అక్కడ మతమున్నది. అందుకే బండి సంజయ్ అభ్యంతరం తెలుపుతున్నారు.
కొత్త సచివాలయం తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా లేదని బండి సంజయ్ కి ఇప్పుడు తెలిసి వచ్చిందా..? ఇన్నాళ్ళు ఏం చేసినట్లు..? ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. ఇటీవల రేవంత్ ప్రగతి భవన్ పై చేసిన వ్యాఖ్యలపై మీడియాలో చర్చ జరుగుతోంది. రేవంత్ చేపట్టిన యాత్ర గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. అందుకే బండి సంజయ్ వ్యూహాత్మకంగా ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తు దోషం ఉందని చక్కటి సచివాలయాన్ని కూల్చివేశాడు కేసీఆర్. ఇప్పుడు కొత్తగా బండి సంజయ్ బీజేపీ అధికారంలోకి వచ్చాక సచివాలయ డోమ్ లను కూల్చి మార్పులు చేస్తానని అంటున్నారు. మీదేం పోయింది. ప్రజల సొమ్మే కదా. ఎంతైనా వాడేస్తారు. కష్టం చేసేది ఉందా..? చెమటను చిందించేది ఉందా..? విజ్ఞులైన ప్రజలే ఆలోచించాలి.