తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడినా ఓ సంచలనమే. తాజాగా మరోసారి అలాంటి సంచలన వ్యాఖ్యలే చేశారు. ప్రతిసారి హిందూ- ముస్లింలకు సంబంధించి వ్యాఖ్యలు చేసి సంచలనాలు సృష్టించే బండి సంజయ్ ఈసారి మాత్రం వాస్తవ పరిస్థితులను వివరించి పార్టీలో కాక రేపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..సోమవారం వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీ చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని వ్యాఖ్యానించి పెద్ద చర్చకు తెరలేపారు. ఇన్నాళ్ళు బీజేపీపై విమర్శలు చేస్తు ఆ పార్టీకి అభ్యర్థులే దిక్కు లేరు.. అధికారంలోకి ఎలా వస్తారనుకుంటున్నారని ప్రత్యర్ధి పార్టీ నేతలు ప్రశ్నించేవారు. వీటిని ఖండించేవారు బండి. ఇప్పుడు ఆయనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చెస్తున్నాయి.
వాస్తవాన్ని అంగీకరించాలని ఇలాంటి కామెంట్స్ చేశారా..? లేక వేములవాడలో ఈటల వర్గం నేత తుల ఉమ టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి ఆమె సరైన అభ్యర్థి కారని చెప్పేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా..? అనే చర్చ కమలం కాంపౌండ్ లో ప్రారంభమైంది. ఓ వైపు కాంగ్రెస్ ఊపుమీద కనిపిస్తున్న తరుణంలో పార్టీలో జోష్ నింపాల్సిన రాష్ట్ర అద్యక్షుడు పార్టీలో పోటీ చేసేందుకు అన్ని స్థానాల్లో అభ్యర్థులే లేరని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది.
ఈటలను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే అసంతృప్తితోనే పార్టీకి అధికారంలోకి వచ్చేంత స్టామినా లేదని బండి సంజయ్ చురకలు అంటించారా..? అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఏదీ ఏమైనా బండి సంజయ్ కామెంట్స్ మాత్రం ఆ పార్టీ శ్రేణుల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయనేది మాత్రం స్పష్టం అవుతోంది.