బీజేపీ అధికారంలోకి వచ్చినా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అనేక భూవివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ధరణి పోర్టల్ ను కూడా కొనసాగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకు ధరణిని రద్దు చేస్తామని ప్రకటించిన బండి.. కేసీఆర్ ధరణిపై మాట్లాడుతూ ఇటీవల ప్రతిపక్షాలపై విమర్శల మోత మొగిస్తోన్న వేళ బండి ఈ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చినా, కేసీఆర్ పథకాలనే కొనసాగించేటట్లైతే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి..? అనే ఆలోచన ఓటర్లకు తడితే అది కమలం పార్టీకి మైనస్ అవుతుంది.
ధరణి పోర్టల్ విషయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణి తప్పుల తడకగా ఉంది. ధరణితో చాలామంది భూములను కోల్పోయారు. ఈ పోర్టల్ తో అధికార పార్టీ నేతలు పెద్దఎత్తున అక్రమాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే వరంగల్ డిక్లరేషన్ సమయంలో రాహుల్ గాంధీతో ధరణిపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన ఇప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని రాహుల్ ప్రకటించారు. ఇప్పటికీ రేవంత్ ఇదే వైఖరితో ఉన్నారు. మొన్నటివరకు ధరణిని రద్దు చేస్తామని మాట్లాడిన బండి హటాత్తుగా మాట మార్చారు.
జిల్లాల పర్యటనలో భాగంగా ధరణి పోర్టల్ ను వ్యతిరేకిస్తోన్న నేతలపై కేసీఆర్ శివాలెత్తుతున్నారు. ధరణి ఎత్తివేస్తే రైతు బంధు డబ్బులు రావని చెబుతున్నారు. రైతు బంధు ప్రారంభించినప్పుడు ధరణి పోర్టల్ లేదని… రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. కానీ బండి సంజయ్ మాత్రం కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయి.. ధరణిని కొనసాగిస్తామని కామెంట్స్ చేసి విశ్వసనీయతను కోల్పోయారు.
బీజేపీ అధికారంలోకి వచ్చినా కేసీఆర్ అమలు చేసే పథకాలు కొనసాగిస్తామని బండి చెబుతున్నారు. ఇంతదానికి బీఆర్ఎస్ ను కాదని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనే ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తుంది. ఏదీ ఏమైనా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఫేవర్ చేసేలా ఉన్నాయనేది మాత్రం సుస్పష్టం.