నాగర్ కర్నూల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకోగా.. తాజాగా జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ లో కొనసాగుతోన్న బాలాజీ సింగ్ కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ ను ఆశించారు. రానున్న ఎన్నికల్లో టికెట్ జనరల్ కు వస్తే కసిరెడ్డి నారాయణ రెడ్డికి, బీసీలకు అయితే తనకు ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థించారు. కానీ కసిరెడ్డి, బాలాజీ సింగ్ అభ్యర్థనలను అధిష్టానం పట్టించుకోలేదు. మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే కేటాయించింది. దీంతో బాలాజీసింగ్ కొన్ని రోజులుగా తన వర్గంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకానొక దశలో ఆయన బీఎస్పీ నుంచి బరిలో దిగేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక సమావేశాలు ఆపాలనే హైకమాండ్ ఆదేశాలతో సైలెంట్ అయ్యారు.
ఇదిలా సాగుతుండగానే కాంగ్రెస్ పార్టీ నేతలు కసిరెడ్డి నారాయణ రెడ్డితో చర్చలు ప్రారంభించారు. కాంగ్రెస్ లో చేరితే టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కసిరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరేందుకు నిర్ణయం తీసుకోగా.. తాజాగా జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ తోనూ కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. తన వర్గం నాయకులు, కార్యకర్తలతో చర్చించి వారి అభిప్రాయం మేరకు కాంగ్రెస్ లో చేరికపై తుది నిర్ణయం వెలువరిస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.
కసిరెడ్డితో బాలాజీ సింగ్ కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దాంతో కసిరెడ్డితోపాటు ఆయన కూడా కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బాలాజీ సింగ్ తోపాటు పలువురు జడ్పీటీసీలు, సర్పంచ్ లు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.
Also Read : కేటీఆర్ కన్విన్స్ చేసినా కసిరెడ్డి మెత్తబడలేదా..?