ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేష్ పై పోటీకి వైసీపీ నుంచి బైరెడ్డి సిద్దార్థ రెడ్డి బరిలో నిలవనున్నారా..? అంటే అవుననే అంటున్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే కొడాలి నాని. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
యువగళం పేరిట పాదయాత్ర చేస్తోన్న నారా లోకేష్ సీఎం జగన్ పై పదేపదే విమర్శలు చేస్తున్నారు. దీంతో కొడాలి నాని తనదైన శైలిలో రెచ్చిపోయారు. లోకేష్ తాను పెద్ద నాయకుడిననే భ్రమలో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు అంత సీన్ లేదని.. జగన్ విమర్శించే స్థాయి లోకేష్ ది కాదని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే లోకేష్ కు కొడాలి నాని సవాల్ విసిరారు.
లోకేశ్ యువగళానికి పోటీగా తమ పార్టీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో సభ పెట్టిస్తామన్నారు. లోకేష్ సభ కంటే సిద్దార్థ రెడ్డి సభకు పదిరేట్లు యువత రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. యువతలో లోకేష్ కంటే సిద్దార్థకే ఎక్కువ క్రేజ్ ఉందని తెలిపారు. ఏపీలో ఎక్కడైనా లోకేష్ పిలిస్తే ఎంతమంది వస్తారో.. సిద్దార్థ పిలిస్తే ఎంతమంది వస్తారో చెక్ చేసుకోవాలన్నారు కొడాలి నాని.
వచ్చే ఎన్నికల్లో లోకేష్ పై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పోటీ చేస్తారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా లోకేష్ అక్కడి నుంచే పోటీ చేయనున్నారు. కానీ బైరెడ్డి మాత్రం రాయలసీమ సెంటర్ గా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. దాంతో ఆయన అక్కడి నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే..కొడాలి నాని నోటికి వచ్చింది మాట్లాడుతారని.. ఆయన వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోనవసరం లేదని అనేవారు కూడా ఉన్నారు. మరోవైపు..లోకేష్ ను లక్ష్యంగా చేసుకొని బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఇటీవల కాలంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ మనస్సులో ఏమో ఉందని..అందుకే లోకేష్ ను సిద్దార్థరెడ్డి టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.
Also Read : జనసేనలోకి వంగవీటి రాధా.. లోకేష్ తో ఏం చర్చించారు..?