వైఎస్ వివేకా హత్య కేసులో రెండోసారి సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఐదుగంటలపాటు విచారించి ఆయనను ఇంటికి పంపించారు. మరోసారి విచారణకు రమ్మని అధికారులు చెప్పలేదని అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ హత్యకేసుకు సంబంధించి హైకోర్టులో సీబీఐ వేసిన కౌంటర్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు కలిసి వివేకాను హత్య చేసేందుకు ఎలా ప్రయత్నించారో వివరించడంతో శుక్రవారం రోజున అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఉదయం నుంచి ప్రచారం జరిగింది కానీ ఆయన్ను విచారించి బయటకు పంపించారు.
సీబీఐ విచారణ అనంతరం బయటకొచ్చిన అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసు విచారణలో ఉందని ఈ సమయంలో మీడియా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అబద్దాన్ని సున్నా నుంచి వందకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని…ఓ నిజాన్ని సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సీబీఐ మీద కూడా ఆరోపణలు చేశారు. ఏడాది కిందట టీడీపీ చేసిన ఆరోపణల్ని సీబీఐ తాజా కౌంటర్ లో పొందుపరచిందని.. విచారణ అంతా వ్యక్తి టార్గెటెడ్ గా కొనసాగుతుందని అన్నారు.
వివేకా చనిపోయే ముందు రాసిన లేఖ ఎక్కడ ఉందని.. దాన్ని బయటకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. వాటిని సీబీఐ అధికారులు చూసుకుంటారు. కానీ ఆయన సీబీఐ విచారణపైనే సందేహాలను లేవనెత్తుతున్నారు. తాను వివేకం సార్ హత్య జరిగిన రోజు ఏం మాట్లాడానో సీబీఐ అధికారులకు అదే చెప్పానని.. ఎప్పుడు అడిగినా అదే చెబుతానని స్పష్టం చేశారు. గూగుల్ టేకౌటో అని మాట్లాడుతున్నారని అది గూగుల్ టేకౌటో, టీడీపీ టెకౌటో భవిష్యత్ లో కాలమే నిర్ణయిస్తుందని వెల్లడించారు. మొత్తంగా ఈ కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతుందంటూ అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
శుక్రవారం నాటి విచారణలో బ్యాంక్ లావాదేవీలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను ప్రస్తావిస్తూ అవినాష్‌ను విచారించారని అంటున్నారు. ఈ కేసులో అసలు సూత్రధారులెవరో తేల్చేలా కేసు విచారణ సాగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదంటున్నారు.