వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని దాఖలు చేసిన అవినాష్ రెడ్డి పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అంటే తీర్పు వచ్చే వరకు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం కుదరదన్నమాట. తుది తీర్పు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. అప్పటివరకు మాత్రం అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం తొలగినట్లే.
పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండటంతో సీబీఐ విచారణకు మినహయింపు ఇవ్వాలని హైకోర్టును అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాది కోరారు. దాంతో ఈ మినహాయింపు విషయాన్ని సీబీఐనే అడగాలని హైకోర్టు సూచించింది. ఈ కేసు విచారణలో వీడియోగ్రఫీ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ కార్యాలయం ఎదుట అవినాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు చేయడం కూడా తప్పేనని హైకోర్టు తెలిపింది.
ఈ కేసు విచారణ కోసం సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డిని పిలిచినప్పుడల్లా వెళ్ళాల్సి ఉంటుంది. అరెస్ట్ చేయడానికి మాత్రం వీల్లేదు. అంతగా ఫిక్స్ అయితే హైకోర్టు తీర్పుపై సీబీఐ హైకోర్టు డివిజన్ బెంచ్ కు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవాలి. అయినప్పటికీ హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండగా సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడ కూడా ఆశించిన తీర్పు వచ్చే అవకాశం లేదు. దాంతో ఈ తీర్పు ఎప్పటికి వస్తుందో తెలియదు.
ఈ వ్యవహారాన్ని వీలైనంత కాలం పొడిగించాలనుకుంటున్న అవినాష్ రెడ్డి…మరో పిటిషన్ దాఖలు చేశారు. సునీత దాఖలు చేసిన పిటిషన్ సీబీఐ ఒత్తిడి వలన జరిగిందని పిటిషన్ లో అవినాష్ రెడ్డి ఆరోపించారు. తనపై ఆరోపణలు చేయడంతోనే ఇంప్లీడ్ పిటిషన్ వేసినట్లు పిటిషన్ లో సునీత పేర్కొన్నారు. పిటిషన్ పై విచారణలు పూర్తయ్యే వరకూ రిజర్వ్ చేసిన తీర్పు రాదన్న ఉద్దేశంతో ఇలాంటి పిటిషన్లను దాఖలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.