రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్రకు వస్తోన్న స్పందనను చూసి ఓర్వలేకే కిరాయి మూకలతో యాత్ర వాహనంపై బీఆర్ఎస్ దాడులు చేయించింది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. అంతకు ముందు ఇదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఏమేం చేస్తుందో స్పష్టంగా చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి అయిపోదామని ఆలోచనతోనున్న కేటీఆర్ కు రేవంత్ యాత్ర సక్సెస్ కావడం తట్టుకోలేకపోతున్నారు. అందుకే కెటిఆర్ హుటాహుటిన ఇక్కడే సుడిగాలి పర్యటన చేసి మీటింగ్ పెట్టారు. రేవంత్ రెడ్డి మీద ధ్వజమెత్తుతూ గతంలో కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల పాటు పరిపాలించే అధికారం ఇస్తే భూపాలపల్లికి ఏం చేసింది అని ప్రశ్నించారు. పైగా మరొక్క అవకాశం కోసం అధికారం అడుక్కోవడం ఏమిటని అహంకార పూరితంగా మాట్లాడారు.
పాదయాత్రలో భాగంగా దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన డ్యాములు, పేదలకు ఇచ్చిన భూములు, వాళ్లు కాట్టిన ఇందిరమ్మ ఇల్లు తదితర అభివృద్ధి కార్యక్రమలను వివరించి కేటీఆర్ చెంపచెల్లుమనేలా సమాధానం ఇచ్చారు. ఇవన్ని నిజం కాదని చెప్పే దమ్ముందా… లేకపోతే తండ్రి, కొడుకులు ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పలని ఛాలెంజ్ విసిరారు.
రేవంత్ వరుసగా విసురుతోన్న సవాళ్ళకు అధికార పక్షం నుంచి సహేతుకమైన సమాధానం రాలేదు సరికదా.. వ్యక్తిగత దూషణలు సమాధానం కావడం ప్రజల్లో ఓ రకమైన ఆలోచనను రేకెత్తించింది. కాంగ్రెస్ తో పోలిస్తే పేదలకు బీఆర్ఎస్ ఏ రకంగానూ మేలు చేయలేదనే ఆలోచన మొదలైంది. దీంతో రేవంత్ సవాల్ కు తోక ముడిచి రాజకీయ అసహనంతో కిరాయి మూకలతో బీఆర్ఎస్ దాడులు చేయించిందని స్పష్టం అవుతుంది.
రేవంత్ రెడ్డి పాదయాత్ర రోజు రోజుకు అద్భుత ఆదరణ రావడం చూసి బిఆర్ఎస్ లో గుబులు పుట్టింది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్రను గుర్తుకు తెచ్చింది. వైఎస్ కూడా చాప కిందా నీరులా వచ్చి రాష్ట్రం మొత్తం తిరిగి అధికారాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఎలా విఫలమయ్యిందో చెప్పడంలో రేవంత్ రెడ్డి తన మార్క్ ని చూపుతున్నారు. కెసిఆర్, కెటిఆర్ అసమర్థ పాలన ప్రజల గుండెలు తాకేలాచేస్తోంది. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారో , ఎందుకు ఫెయిల్ అయ్యారో పూస గుచ్చినట్లు క్లారిటిగా చెపుతున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ చేస్తున్న కుంభకోణాలను అన్ని కోణాల్లో చక్కగా ఎండగడుతున్నారు. వాళ్ళ అసమర్థ పాలన గురించి చెపితే పర్వాలేదు. కానీ వాళ్ళు చేసిన కుంభకోణాలను వెలుగులోకి తెస్తే ప్రజల్లోకి ‘నెగిటివ్’ సంకేతాలు వెళతాయి. కాంగ్రెస్ బలపడుతుంది. అందుకే ఈ వక్ర బుద్ధితో రేవంత్ రెడ్డిపై కిరాయి మూకలను మొహరించినట్లు తెలుస్తోంది.