తీన్మార్ మల్లన్న నిర్వహిస్తోన్న ‘క్యూ న్యూస్’ ఆఫీసుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కర్రలతో క్యూ న్యూస్ ఆఫీసులోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఆఫీసులోని ఉద్యోగులపై భౌతికదాడికి దిగడమే కాకుండా చంపేస్తామని బెదిరించారు. అఫిసులోని ఫర్నీచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి చేయడంతో బోడుప్పల్ పోలీసులకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు.
ఆదివారం ఉదయం మార్నింగ్ షో విత్ మల్లన్న ప్రసారాలు ముగిసాక 20మంది దుండగులు క్యూ న్యూస్ ఆఫీసులోకి చొరబడ్డారు. ముఖాలకు మాస్క్ లను ధరించి చేతిలోనున్న ఆయుధాలతో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. విలువైన హార్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్లిపోయారు. కార్యాలయంలో ఉన్న పెన్ డ్రైవ్ లను ధ్వంసం చేశారు. బోడుప్పల్ నుంచి ఆఫీసును ఖాళీ చేయాలంటూ హెచ్చరించారు.
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే ఊరుకునేది లేదని క్యూ న్యూస్ ఉద్యోగులను బెదిరించారు. పలువురు ఉద్యోగులను పగిలిన గాజు సీసాలతో గాయపరిచారు. గత కొంతకాలంగా తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. లిక్కర్ స్కామ్ మరియు పేపర్ లీకేజీ వార్తలపై సంచలన కథనాలు ప్రసారం చేస్తుండటంతో మల్లన్నపై సర్కార్ కుట్రలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో క్యూ న్యూస్ ఆఫీసును ఖాళీ చేయించేలా బిల్డింగ్ ఓనర్ పై ఒత్తిడి చేశారు. మల్లన్నకు ఇచ్చిన ఆఫీసులో క్యూ న్యూస్ ప్రసారాలు జరగకుండా చూడాలని..ఇందుకోసం మల్లన్నను ఆఫీసు నుంచి ఖాళీ చేయించాలని మేడిపల్లి సీఐ ఆఫీసు యజమానిపై ఒత్తిడి చేశారు. కానీ అందుకు ఓనర్ అంగీకరించలేదు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా వార్త కూడా ఒకటి ప్రసారం కావడంతో మంత్రి అనుచరులు..క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి చేశారు.
తొలివెలుగు జర్నలిస్ట్ రఘును ఆ ఛానల్ నుంచి అవమానకర రీతిలో బయటకు పంపిన మరోసటి రోజే తీన్మార్ మల్లన్న ఛానల్ పై దాడి జరగడం గమనార్హం.