తెలంగాణ ఉద్యమకారులకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానని నాడు సెంటిమెంట్ డైలాగ్ లు కొట్టిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయాడు. కేసీఆర్ పిలుపుకు స్పందించి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన పాలమూరు బిడ్డ మున్నూరు రవిపై కిరాయి మూకలు దాడి చేయిస్తే కేసీఆర్ కాదు కదా ఆ పార్టీ నేతలెవరూ స్పందించలేదు. ప్రతిపక్ష పార్టీలు ఉద్యమకారుడైన మున్నూరు రవిపై దాడి ఘటనను ఖండించాయి. రవికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కానీ కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం కిమ్మనడం లేదు. మహబూబ్ నగర్ టికెట్ ఆశించడమే మున్నూరు రవి చేసిన నేరమా..? తెలంగాణ రాష్ట్రం కోసం నిఖార్సుగా కొట్లాడిన వ్యక్తిగా మున్నూరు రవికి టికెట్ ఆశించే అర్హత లేదంటే ఎలా..? మానుకోట ఉద్యమకారుల మీద రాళ్ళేసిన వ్యక్తిని ఎమ్మెల్సీ చేశారు. కరీంనగర్ , తాండూర్ లో ఉద్యమకారులను ఉరికించికొట్టిన గంగుల , పట్నంలకు తెలంగాణ ప్రభుత్వంలో పెద్దపీట వేసిండ్రు. కానీ ఉద్యమకారుడు అయిన మున్నూరు రవి టికెట్ ఆశిస్తే తప్పేలా అవుతుంది.
శ్రీనివాస్ గౌడ్ కు అక్కడ ఓటమి భయం పట్టుకుంది. మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు మరోసారి టికెట్ ఇస్తారా..? కేటీఆర్ అండతో ఏమైనా నెట్టుకొస్తారా..? అనేది వేరే చర్చ. కానీ సహచర ఉద్యమకారుడిపై దాడి జరిగితే ఉద్యమపార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ ఈ దాడి ఘటనపై సైలెంట్ గా ఉంది. టికెట్ ఆశించి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు మున్నూరు రవి పాల్పడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలి. అంతేకాని మర్డర్ ప్లాన్ చేయడం ఎందుకు..?
నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులే రవిపై దాడి చేస్తే ఖండించడానికి ఏం ఇబ్బంది?లీడర్ల సమస్య మీ సమస్యగా ఫీలైతుండ్రేమోగాని..మీ సమస్యలు లీడర్ల సమస్యలు అస్సలు కావు. గిందుకే తెలంగాణ కోసం కొట్లాడిన టీఆర్ఎస్ వేరు.. ఇప్పటి బీఆర్ఎస్ వేరు అనేది. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాని ఇంత ఘోరంగా కొట్టుడైతే సూడలే. బీఆర్ఎస్ దేశానికి చూపించే మోడల్ ఇదేనా..?