ఐటీ, ఈడీలు దాడులు చేస్తే వాటిని ఎదుర్కోవాలని, ఎదురుదాడులు చేయాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈడీ, ఐటీ దాడులను ఎలా ఎదుర్కొవాలో పార్టీ నేతలకుట్రైనింగ్ ఇచ్చినట్లుగా ఆయన ప్రసంగించారు. కేసీఆర్ సలహాను ప్రస్తుతం ఐటీ దాడులను ఎదుర్కొంటున్న మంత్రి మల్లారెడ్డి ఆచరణలో పెడుతున్నారు. వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు.
ఐటీ అధికారులతో దురుసుగా ప్రవర్తించారని , తాము సేకరించిన పలు పత్రాలను మల్లారెడ్డి లాక్కున్నారని ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ దాడులు జరిగితే దాదాపు అందరూ సహకరించిన వారే ఉన్నారు కాని మల్లారెడ్డి మాత్రం ఐటీ అధికారుల తనిఖీలకు ఏమాత్రం సహకరించినట్టు లేరు. అంతేకాదు ఐటీ అధికారులపై ఎవరు ఎదురుదాడికి దిగలేదు. మల్లారెడ్డి మాత్రం కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో డీ అంటే డీ అంటున్నారు. ఇలా వ్యవహరిస్తే ఆయన మరికొన్ని సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుందన్నది మల్లారెడ్డికి తెలియనిది కాదు. అయినప్పటికీ ఐటీ అధికారులతో దుందుడుకు చర్యలకు ఎందుకు దిగుతున్నారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.
ఐటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో మల్లారెడ్డి కూడా ఫిర్యాదులు చేశారు. తమపై దాడి చేశారని.. తమ వద్ద నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి కేసు నమోదు అయిందో లేదు. కానీ పోలీసులు ఎలాగు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే పని చేస్తారు కాబట్టి.. ఐటీ ఆఫీసర్స్ పై కేసు నమోదై ఉండొచ్చునని అంటున్నారు.