ఒక్క నిముషం ఆలశ్యం పేరుతో మూడువందల అరవై రోజులు చదివిన చదువును మసి చేస్తారా? మూసీ మురుగు కాలవ పక్కన, నాలుగు చినిగిన గోనెపట్టాల కింద, ఎండకు ఎండి వానకు తడిసిన బాల్యం నుండి, దొర ఇస్తానన్న రెండు పడక గదుల గురించి కలలు కంటూ, ఆముదపు దీపం కింద చదివి పొద్దున్నే ముక్కుల్లోంచి నల్లని మసి కడిగి ఎక్కడో గొట్టాం గాడి కాలీజీలోలో పరీక్ష సెంటర్ పడితే…
తిన్నబువ్వ కడుపులో కలదిరిగి మెలిదిరిగి, మూడు బస్సులు మారి సెంటర్ దగ్గరకు వస్తే ఈ మధ్యలో శిదిలమై చిద్రమైన పసి కాయాలు యెన్నో.
ఒక్క నిముషం పేరుతో నా నెత్తిన నిప్పులు పోస్తిరి కదరా దొంగ నా కొడకుల్లారా.
అరె సాలె… ఇచ్చిన హామీ దశాబ్దాలుగా తీర్చని నాయకులున్న చోట, సమయానికి బస్సు , రైలు నడవని చోట, సమయానికి నల్లా వదలని చోట, పదింటికి ఆఫీసు అయితే పన్నెండు గంటలకు వచ్చే ఉద్యోగులున్న దరిద్రపు లోకంలో ..
ఉద్యోగాలు ఇచ్చే సర్వీస్ కమీషన్ ఉద్యోగులు అధికారులు లవర్ కళ్ళల్లో ఆనందం చూడడానికి కాన్ఫిడెన్సియల్ సెక్షన్ లోకి జొరబడి మరీ ప్రశ్నాపత్రాలు ఒకరు, కొలువులు మరొకరు అమ్ముకున్న అమ్ముకుంటున్న పరమ పంకిల పవిత్ర లోకం లో
పగలంతా కప్పులు కడగి, బాసిన్లు తోమి, రాత్రంతా మెలుకువతో యాడాది అంతా చదివి, ఇంటర్ పాసై చిన్న కొలువన్నా వస్తదన్న ఆశలో పరీక్షకు వస్తే ఒక్క నిముషం పెట్టి నన్ను ఆగం జేస్తిరి కదరా.
అరే …
నగరంలో కొలువు చేస్తే మరింత HRA వస్తదని పంతుల్ల దగ్గర డబ్బులు తీసుకొని పైరవీలు చేసే నాయక పంతుళ్ళు ఉన్నచోట, ప్రశాపత్రాలు కార్పోరేట్బ కళాశాలకు అమ్ముకుని చిప్పకూడు తిన్న ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నచోట,
బడికి రాకుండా వేతన కూలీలను పెట్టి నెలకు జీతం దొబ్బే సంఘ నాయకులు ఉన్న చోట ….
కోట్లాది రూపాయలకు ఎంసెట్ పరీక్ష ముందే అమ్ముకున్న నాయకులు అధికారులూ ఉన్నచోట, ముచ్చటగా మూడు సార్లు ఎంసెట్ పెట్టిన చోట,దాని బాధ్యులు ఎవరో ఈనాటికీ తేల్చని చోట,
ఇరవై ఏళ్ళు ఉస్మానియా హాస్టల్ లో పందిలా తిని బుగ్గ కారు రాగానే నాన్ బోర్దర్స్ దేశ రక్షణకు ముప్పు అని తీర్మానం చేస్తున్న చోట,
ఎందుకయినా మంచిది అని ముచ్చటగా మూడు పార్టీల చోట కర్చీఫ్ వేసి అధికార పార్టీలో పాతివ్రత్యం నిరూపించుకున్న చోట, పరీక్షకు నిముషం ముందు రానివాడు జీవితంలో దేనికీ పనికిరాడు అని ఈ నిబందన పెట్టి ఎంత మంది పిల్లల ఉసురు పోసుకున్నారు రా
కేవలం కాలినడకన,లేదా సిటీ బస్ లో బయలు దేరి వస్తే ఒక్క నిముషం నిబందన పెట్టి ఎవరిని ఉద్దరిస్తారురా మీరు?
గుర్రం సీతరాములు
Also Read : TSPSCపేపర్ లీకేజ్ లో మరో ట్విస్ట్… అసలు విషయం ఏంటంటే..?