కేంద్రం డైరక్షన్ లో టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా ఈడీ దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లు ముందే చెప్పేశారు. తమపై ఈడీ దాడులు చేసినా బెదరమని, ఎం చేయాల్నో , ఎలా ఈడీ దాడులను ఎదుర్కోవాలో తమకు తెలుసునని పెద్ద , పెద్ద డైలాగ్ లే పేల్చారు. కేసీఆర్ ముందస్తు సమాచారంతోనే ఈ ప్రకటన చేశారో లేక అంచనా వేశారో కాని, టీఆర్ఎస్ నేతలపై ఈడీ దాడులైతే జరిగాయి. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర నివాసాలలో, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేశారు. సొంత పార్టీ నేతలపై ఈడీ దాడులు జరిగినా టీఆర్ఎస్ అధినాయకత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
ఈడీ, ఐటీ దాడులతో సీఎం కేసీఆర్ వెంటనే గంగుల , రవిచంద్రలను ప్రగతి భవన్ కు పిలిపించుకొని మాట్లాడారు. తాను చూసుకుంటానని వారిద్దరీకి కేసీఆర్ అభయం ఇచ్చారు. అదే సమయంలో ఇంకా ఎవరెవరు హిట్ లిస్టులో ఉన్నారని చర్చించారు. టీఆర్ఎస్ నేతలపై ఈగ వాలిన భూకంపం సృష్టిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ చడీ చప్పుడు లేకుండా ప్రగతి భవన్ కే పరిమితం అయ్యారు. నిజానికి , గంగుల నివాసానికి తాళం వేసి ఉండటంతో తాళాలు పగలగొట్టి మరీ ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిపై టీఆర్ఎస్ అధినేత మీడియా ముంగిటకు వచ్చి కేంద్రంపై రెచ్చిపోతారని..నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తారని అంత భావించారు. కానీ కేసీఆర్ మౌనంగానే ఉండిపోయారు.
గ్రానైట్ వ్యాపారస్తులే లక్ష్యంగా మంత్రి గంగుల కమలాకర్ తోపాటు మరికొంతమంది గ్రానైట్ వ్యాపారులపై దాడులు నిర్వహించినప్పుడే , మరికొంతమంది టీఆర్ఎస్ నేతల ఇళ్ళపై ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని కేసీఆర్ కు సమాచారం ఉంది. కాని వద్దిరాజ్ రవిచంద్రను కేసీఆర్ ఎందుకు అప్రమత్తం చేయలేదని ప్రశ్న తెరపైకి వస్తోంది. దీని బట్టి చూస్తె ప్రస్తుతం కొనసాగుతోన్న ఈడీ దాడులు బీజేపీ , టీఆర్ఎస్ ల డ్రామా అని అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. అయితే, ఈడీ అధికారులు దాడులతోనే సరిపెట్టేస్తారా.? లేక గ్రానైట్ ఎగుమతుల్లో జరిగిన అక్రమాలని నిరూపించి అరెస్ట్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
గ్రానైట్ ఎగుమతుల్లో జరిగిన అక్రమాలని నిరూపించి, టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తేనే తెలంగాణలో బీజేపీకి విశ్వసనీయత ఉంటుంది. లేదంటే టీఆర్ఎస్ – బీజేపీలు ఒకటేనని కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలే నిజమనే నమ్మే అవకాశం కూడా లేకపోలేదు కాబోలు.