బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన నేతలు ఆ లక్ష్యం ఆ పార్టీతో సాకారం అయ్యేలా లేదనే అంచనాతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పార్టీలో చేరిక సమయంలో కేసీఆర్ తో ఎలాంటి లోపాయికారి ఒప్పందం ఉండదని హామీ ఇచ్చి.. ఇప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీ లొంగిపోయినట్లు కనిపిస్తుందని కమలం నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో ఉంటే తమ లక్ష్యం నెరవేరదని ఓపెన్ గానే ప్రకటిస్తున్న ఆ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా..? అని ఆలోచనలో పడిపోయారు.
తెలంగాణలో బీజేపీ రాజకీయ ఆత్మహత్య చేసుకుందని విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా…ఆమెను పార్టీలో సీనియర్ నేతలేవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆమెతోపాటు సీక్రెట్ భేటీలు నిర్వహిస్తున్న ఓ ఐదారు మంది నేతలు బీజేపీ విధానాలు బీఆర్ఎస్ విషయంలో ఏమాత్రం సరిగా లేవని తూర్పారబడుతున్నారు. పూర్తిగా బీఆర్ఎస్ కు బీజేపీ సహకరిస్తుందన్న ఆలోచనకు వచ్చేస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో కొనసాగుతామని ప్రకటిస్తూనే..బీఆర్ఎస్ విషయంలో బీజేపీ ఇంకా అగ్రెసివ్ స్టాండ్ తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
కాంగ్రెస్ ను కాదని బీజేపీలో చేరిన నేతలంతా ఆ పార్టీలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలతో ఆలోచనలో పడిపోయారు. కేసీఆర్ ను పవర్ నుంచి ఫామ్ హౌజ్ కు పంపించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరితే.. ఇక్కడేమో పరిస్థితులు రానురాను భిన్నంగా తయారయ్యాయని విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీలో అసంతృప్తుల వాదన చూస్తుంటే.. బీఆర్ఎస్ ను ఓడించడం బీజేపీతో సాధ్యం కాదు.. కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని పరోక్షంగా చెప్తున్నట్లు అనిపిస్తోంది.
ఎందుకంటే..బీజేపీ అసంతృప్తుల వాదనలు అలాగే ఉన్నాయి. బీఆర్ఎస్ తో డీ అంటే డీ అనే స్థాయి నుంచి ఎందుకీ సైలెంట్ మోడ్ లోకి వచ్చేశారని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అందర్నీ అరెస్ట్ చేసి కవితను మాత్రం అరెస్ట్ నుంచి ఎందుకు మినహాయించారని.. ఇవన్నీ బీఆర్ఎస్ తో బీజేపీకి ఎలాంటి ఒప్పందం లేకుండానే జరిగిపోతున్నాయా..? అని పార్టీ నేతల ప్రశ్నలను చూస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ సహకరిస్తుందనే అనుమానాలను ప్రజల్లో కలగడానికి ఆ పార్టీ లీడర్లే కారణం అవుతున్నారు. అధికార పార్టీకి కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు సంకేతాలు ఇచ్చినట్లు కనబడుతోంది.
Also Read : పోటీపై బీజేపీ ఎంపీలు వెనక్కి తగ్గడం వెనుక BRS హస్తం ఉందా….?