తన అన్న కిషోర్ రెడ్డి వైసిపిలో చేరడం అఖిలకు మైనస్ అవుతోందా?..అఖిలకు వ్యతిరేకంగానేసుబ్బారెడ్డి రాజకీయాలు ఉండబోతున్నాయా?.అఖలకు కుటుంబ సభ్యులే ఎందుకు యాంటీ అయ్యారు?
కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి కుటుంబం రాజకీయంగా దశాబ్దాల కాలం శాసించింది. నాగిరెడ్డి దంపతుల మరణం అనంతరం జిల్లాలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఆ కుటుంబం ప్రాతనిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు ఖిల్లాగా ఉండేది. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసురాలిగా భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ.. అనేక వివాదాలు చుట్టుముట్టి నప్పటికీ.. ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు ఆమెకు సీటు ఇవ్వడమే పెద్ద విజయమని ఆమె అనుచరులే వ్యాఖ్యానిస్తుంటారు.
అయితే, రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే వాదన ఇప్పుడు కూడా జరిగింది. ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో దూసుకెళ్తున్న భూమా కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది అని చెప్పవచ్చు. భూమా నాగిరెడ్డి అన్న కొడుకు అయిన కిషోర్ రెడ్డి గత వారం వైసీపీలో చేరారు. దీని వల్ల భూమా క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోనుందని టాక్. దీని ప్రభావం భూమా అఖిలప్రియ విజయ అవకాశాలపై పడుతోందని అంటున్నారు. భూమా కుటుంబంలో చాలామంది అఖిల ప్రియకు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. ఫ్యామిలీలో ఉన్న వారిలో చాలామంది ఈ మధ్యే మీటింగ్ పెట్టుకుని అఖిలప్రియకు ఎట్టిపరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దని ఒక లేఖ రాశారు. ఒక వేళ అఖిలకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతుందని కూడా జోస్యం చెప్పారు.
పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా, భూమా కుటుంబం ముందుగానే హెచ్చరించినా సరే చంద్రబాబు మాత్రం అఖిలప్రియకు మొదటి జాబితాలోనే టికెట్ ప్రకటించేశారు. ఇదిలావుంటే, నాగిరెడ్డి అన్న కొడుకు కిషోర్ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయాలని అనుకున్నారు.. అనుకోని పరిస్థితుల్లో ఆయన వైసిపి కండువా కప్పుకున్నారు. భూమా కిషోర్ వల్ల అఖిల ప్రియ గెలుపు కష్టమని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కిషోర్ రెడ్డి వైసిపిలోకి వెళ్లటంతో వారి బలం ఒక్కసారిగా పెరిగిందని టాక్ నడుస్తోంది.
ఇక భూమా నాగిరెడ్డి సహచరుడు ఏవి సుబ్బారెడ్డితో కూడా అఖిలప్రియకు విభేదాలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో అఖిలప్రియకి ఏవి సుబ్బారెడ్డి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇది ప్రత్యర్థులకు బలంగా మారుతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎవరు ఏ పార్టీలోకి వెళ్లినా ఎంతమంది పార్టీలు మారినా రానున్న ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని అఖిలప్రియ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, పరిస్థితులు మాత్రం ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ఆమెకు అనుకూలంగా లేవు. దీంతో భూమా ఎలాంటి స్టెప్ వేస్తారు? సొంత వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారు? అనేది ప్రస్తుతానికి మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న.