టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ స్ వెటర్నరీ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు భావించగా… మార్చి ఐదున జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పత్రం లీక్ అయినట్లు పోలిసులు గుర్తించారు. దాంతో విచారణ చేపట్టిన పోలీసులు తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్ పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ తోపాటు పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక ఆమె భర్తతోపాటు ఆమె సోదరుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఏఈ పరీక్ష పేపర్ ను పది లక్షల చొప్పున కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే… ఈ పరీక్ష పేపర్ ను ముగ్గురు మాత్రమే కొనుగోలు చేశారా..? మరెవరైనా కొన్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష పేపర్ లీక్ అయిందని తేలడంతో ఏఈ అర్హత పరీక్షను అధికారులు రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అధికారులు మంగళవారం అధికారిక ప్రకటన వెలువరించనున్నట్లు సమాచారం.
పేపర్ లీక్ ఇలా..
మహబూబ్ నగర్ జిల్లా పగిడ్యాల పంచంగల్ తండాకు చెందిన రేణుక గురుకల్ టీచర్. ఈ క్రమంలోనే ఆమెకు టీఎస్ పీస్సీలో పని చేసే ఉద్యోగి ప్రవీణ్ తో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త దాఖ్య నాయక్ వికారాబాద్ జిల్లా డీఆర్డీఏ లో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. గత ఏడాది టీఎస్ పీస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రవీణ్ తో రేణుక, దాఖ్య నాయక్ లు పేపర్ లీక్ విషయమై ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం రేణుక సోదరుడు రాజేశ్వర్ నాయక్ ను వాడుకున్నారు. ఇక ఇటీవల పరీక్ష రెండు రోజుల ముందు అంటే మార్చి 2వ తేదీన పరీక్ష పత్రాలను పెన్ డ్రైవ్ లో డౌన్ లోడ్ చేసి… వాటిని ప్రింట్ అవుట్ తీసుకున్నారు. అదే రోజున రేణుక దంపతులకు అందించగా ప్రవీణ్ కు ఐదు లక్షలను మూటజెప్పారు. ఆ తరువాత పలువురితో బేరసారాలు నడిపి లక్షల్లో సొమ్ము చేసుకోవాలనుకున్నారు రేణుక కపుల్స్.
అయితే… పరీక్ష పేపర్ ను లీక్ చేసింది చాలక ముగ్గురు అభ్యర్థులను స్వయంగా ఎగ్జాం సెంటర్ వరకు తీసుకెళ్ళారు రేణుక. ఎగ్జాం అనంతరం ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరు పది లక్షలు చెల్లించాలి కానీ ఓ ఇద్దరు డబ్బులు చెల్లించేందుకు కష్టంగా ఉందని రేణుక దంపతులకు చెప్పారు. దాంతో రేణుక దంపతుల ఒత్తిడికి తాళలేక ఇద్దరు అభ్యర్థులు అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇలా ఈ ఇద్దరు అభ్యర్థుల ద్వారా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎఈ పరీక్ష పేపర్ లీక్ కావడంతో అధికారులు ఈ ఎగ్జామ్ ను రద్దు చేయనున్నారు.
ఏఈ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్ కూడా లీక్ కావొచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో ఈ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. టీఎస్ పీస్సీ లో పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు జరిగాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన కేసు దర్యాప్తులో హానీ ట్రాప్ జరిగిందని మొదట ప్రకటించారు. ప్రవీణ్ కోసం నిత్యం ఓ యువతి టీఎస్ పీస్సీకి వస్తు ఆఫీసులో ప్రవీణ్ ను కలిసిందని చెప్పారు. ఈ క్రమంలోనే తనకు పేపర్ ఇవ్వాలని కోరిందని…ఆమె కోసం పేపర్ లీక్ చేసినట్టు పోలీసులు చెప్పారు. కానీ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించాక అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.