వివేకా హత్య కేసులో రోజురోజుకు సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ-1గానున్న ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు లొంగిపోయేందుకు వచ్చిన గంగిరెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇటీవల గంగిరెడ్డిని బెయిల్ ను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు.. మే 5లోపు లొంగిపోవాలని గడువు విధించింది. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు.
వివేకా హత్య కేసులో ఏపీ పోలీసులు గంగిరెడ్డిని మార్చి 28-2019లో అరెస్ట్ చేశారు. గంగిరెడ్డిని అరెస్ట్ చేసి మూడు నెలలు అయినా ఎలాంటి చార్జీషీట్ దాఖలు చేయకపోవడంతో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అదే ఏడాది జూన్ 27న గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది.
ఈ హత్య కేసులో ఏపీ పోలిసుల విచారణ సరిగా లేదని వివేకా కూతురు సీబీఐ విచారణకు ఆదేశించాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో విచారణ చేపట్టిన సీబీఐ.. ఇటీవల గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలనీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది.
దీంతో సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నకేసుల్లో స్పష్టమైన ఆధారాలుంటే డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డిని మే 5వ తేదీలోపు లొంగిపోవాలని గంగిరెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేసింది.
ఈ నేపథ్యంలోనే గంగిరెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జైలులో ఉన్నారు. అప్రూవర్ గా మారడంతో మరో నిందితుడు దస్తగిరి బెయిల్ పైన ఉన్నాడు. తాజాగా గంగిరెడ్డి బెయిల్ రద్దు కావడంతో ఆయన కూడా జైలుపాలు కానున్నారు.
ఈ కేసు విచారణను జూన్ 30వరకు పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించి ఉండటంతో…త్వరలోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Also Read : వివేకా హత్య కేసులో సీబీఐ కీలక అంశాలను పక్కన పెట్టేసిందా..?