ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు అనిపించింది. ఈ బడ్జెట్ లో గొప్పగా కేటాయింపులు ఏమి లేవు కాని ఆదాయపు పన్ను పరిమితిని పెంచి కాస్త రిలీఫ్ ఇచ్చారు నిర్మలా సీతారామన్. ఆదాయపు పన్ను పరిమితిని ఎప్పుడు పెంచుతారా అని ఏడేళ్ళుగా ఎదురుచూసిన వారు ఈ సారి పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అలా అంచనాలు పెట్టుకోకపోవడం వలన తాజాగా ఇచ్చిన మినహాయింపులు ఊరటనిస్తున్నట్లు అనిపిస్తున్నాయి.
ప్రస్తుతం రూ.5లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని రూ. రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అయితే ఇది కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికే. ఏడు లక్షల లోపు ఆదాయం ఉంటే ఇతర మినహాయింపులేమీ పెట్టుకోకుండా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇక పాత శ్లాబ్ విధానంలోనూ కాస్త వెసులుబాటు ఇచ్చారు. ఇప్పటి వరకూ రూ. రెండున్నర లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.3 లక్షల వరకు పెంచారు. శ్లాబుల్ని ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. రూ.3 నుంచి 6 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 5శాతం, రూ.6 నుంచి 9 లక్షల వరకు 10శాతం,9 నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉంటే 15శాతం, రూ.12 నుంచి 15 లక్షల వరకు 20 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.15 లక్షల ఆదాయం దాటిన వారు 30శాతం ట్యాక్స్ కట్టాలి. ఈ మినహాయింపులు పెద్దగా ఊరట కల్పించేవి కాకపోయినా ఎంతో కొంత కనికరించారని చెప్పుకోవచ్చు.
ఎలక్షన్ ఇయర్ కావడంతో పన్నుల భారం మోపితే ఇబ్బంది అవుతుందనుకున్నారు. అందుకే కాస్త రిలీఫ్ ఇచ్చేలా ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇకపోతే.. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, టీవీల పై పన్నులు తగ్గించారు. బంగారం , వెండి, వజ్రాలపై పెంచారు. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఆ రాష్ట్రానికి బడ్జెట్ లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు కేటాయించారు.