ఇంగ్లీష్ మందు ఒక రోగానికి వాడితే దానికి మరో రోగం సైడ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. అలాగే కెసిఆర్ ఏ మంచి పని చేసిన దానికి సైడ్ ఎఫెక్ట్ లాగ ఓ వివాదం మొదలవుతుంది. దళితులను మచ్చికచేసుకుని వచ్చే ఎన్నికలల్లో గంపగుత్తగా ఓట్లు సంపాదించాలి అనుకుని కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు. బాగానే ఉంది. కానీ అంబేడ్కర్ జయంతి రోజు, అంటే ఏప్రిల్ 14 న ప్రారంబించడం లేదు. అది మొన్నటివరకు ఓ వివాదంగా మారింది.
ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని సిద్ధం చేసిన కేసీఆర్ దానిని ఆవిష్కరించే పనిలో ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అంబేడ్కర్ మనమడు ప్రకాశ్ అంబేడ్కర్ ఒక్కరినే ముఖ్య అతిధిగా పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కొత్త వివాదానికి తెరలేపింది. ఇది అంబేడ్కర్ కుటుంబం కార్యక్రమమా? లేక దళితుల కార్యక్రమమా మని దళిత నాయకులు పెదవి విరుస్తున్నారు.
ప్రకాశ్ అంబేడ్కర్ మనవడిని పిలువడం సంతోషమే. కానీ ఆయనతోపాటు దేశంలో చాలా మంది దళిత నాయకులు ఉన్నారు. వాళ్ళల్లో మాయావతి, మీరా కుమారి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మీరా కుమారి స్పీకర్ గా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
ఎందరో దళిత నాయకులు తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించారు. ఇప్పటివరకు వాళ్ళకు దక్కవలసిన గౌరవం ఇంకా దక్కలేదు అని అసంతృప్తితో ఉన్నారు దళిత నాయకులు. దానికితోడు ఇప్పుడు ఈ విగ్రహం ఆవిష్కరణ సభకు దళిత నాయకులను పిలవకపోవడం ఏమిటని కారాలు మిరియాలు నూరుతున్నారు.
కొందరు దళిత నాయకులను కూడా పిలిచి ప్రకాశ్ అంబేడ్కర్ తో పాటు సన్మానిస్తే మొత్తం దళిత జాతినే గౌరవించినట్లు అని సూచిస్తున్నారు. మరి ఈ వివాదాన్ని కెసిఆర్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.