ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు మరో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. రాజకీయ అరంగేట్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నారు. ఆ మధ్య ఏపీ సీఎం జగన్ ను క్యాంప్ ఆఫీసులో కలిసిన అంబటి రాయుడు చాలా సమయంపాటు జగన్ తో ముచ్చటించారు. ఆ తరువాత ఆయన సామజిక మాధ్యమాల్లో జగన్ పాలనను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడంతో రాయుడు వైసీపీలో చేరుతారని అంత భావించారు కానీ రాయుడు రాజకీయ అరంగేట్రం చేయనున్నారని తెలిసి కాంగ్రెస్ చక్రం తిప్పింది. రాయుడుని కాంగ్రెస్ లో చేరే విధంగా మరో మాజీ టీమిండియా క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు రంగంలోకి దింపింది.
రాయుడును కాంగ్రెస్ లో చేరాలని అజారుద్దీన్ కోరినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరి గుంటూర్ జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేయాలనుకున్నారు రాయుడు. కానీ రాయుడును కాంగ్రెస్ లోకి ఆహ్వానించి లోక్ సభ సీటును ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే… ఆయనకు కాంగ్రెస్ ఆఫర్ చేసింది ఏపీలోని లోక్ సభ సీట్ కాదు. తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గమే. మల్కాజిగిరిని మినీ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉంటారు కనుక రాయుడు ఏపీ మూలాలున్న వ్యక్తి అయినప్పటికీ సెలబ్రిటీ హోదాలో ఆదరిస్తారని కాంగ్రెస్ నమ్ముతోంది.
ఎలాగూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయడం ఖాయమే. దాంతో మల్కాజిగిరి సీట్ నుంచి ఎవరు పోటీ చేస్తారని కొద్ది కాలంగా చర్చ జరుగుతోంది. పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడును కాంగ్రెస్ లో చేర్చుకొని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. క్రికెటర్లను, సినీ హీరోలను బీజేపీ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అంబటిని పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది.
అయితే.. అజారుద్దీన్ ఆహ్వానంపై అంబటి రాయుడు ఎలాంటి సమాధానం ఇచ్చారో క్లారిటీ లేదు కానీ మరికొద్ది రోజుల్లోనే ఆయన ఏ పార్టీలో చేరనున్నారనే విషయాలపై క్లారిటీ రానుంది.