ఏపీకి చెందిన మరో క్రికెటర్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. ఈ విషయాన్ని అంబటి రాంబాబు స్వయంగా వెల్లడించాడు. ఇదివరకు రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రాగా తాజాగా అంబటి రాయుడు పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్నారు. అంబటి నిర్ణయానికి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులంతా మద్దతు ప్రకటించడంతో రాజకీయాల్లోకి రావాలని ఫిక్స్ అయినట్లు పేర్కొన్నారు.మంగళవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన ఉద్దేశాలను వెల్లడించాడు.
చదువుకున్న యువత, సమాజం పట్ల అవగాహనా కల్గిన యువత రాజకీయాల్లో రావాలని ఇదే తనను రాజకీయాల వైపు వెళ్ళాలనే ఆలోచనకు దోహదం చేసిందని అంబటి రాయుడు తెలిపారు. అయితే , రాజకీయాల్లోకి వచ్చాక తాను క్రికెట్ కు దూరం మాత్రం కానని స్పష్టం చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు కానీ ఆయన ఇచ్చిన సమాధానం మాత్రం కొన్ని అనుమానాలను తీర్చేలా ఉంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించడంతో ఆయన వైసీపీలో చేరరని అర్థం అవుతోంది.
అంబటి రాయుడు వ్యాఖ్యలను బట్టి టీడీపీ, జనసేన లేదా బీజేపీలో చేరే అవకాశం ఉంది. అయితే తనకు ప్రధాన పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పడంతో.. అంబటి రాయుడుకు దూరపు చుట్టమైన ఏపీ మంత్రి అంబటి రాంబాబు ద్వారా రాయుడుకి వైసీపీ వల వేసి లాగేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇక ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే తాను రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాయుడు ఆ జట్టు గెలుపులో కీరోల్ పోషించారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.