జాతీయ భద్రతసలహాదారు అజిత్ దోవల్ హైదరాబాద్ కు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆయన వచ్చినట్లుగా రాష్ట్ర పోలీసులకు కాని, నిఘా వర్గాలకు కానీ సమాచారం లేదు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అజిత్ దోవల్ హైదరాబాద్ వచ్చారు. భద్రత లేకుండానే కారులో ప్రయాణించారు. కొంతమంది కీలక వ్యక్తులతో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ గోప్యంగా ఉంచారు. మూడు గంటల తరువాత అజిత్ దోవల్ తిరుగు ప్రయాణమై ఢిల్లీ వెళ్ళిపోయారు.
జాతీయ భద్రత సలహాదారుగా కొనసాగుతున్న అజిత్ దోవల్ కు కేంద్రమంత్రితో సమానమైన భద్రత కల్పిస్తున్నారు. అలాంటిది ఆయన హైదరాబాద్ లో ఎలాంటి భద్రత లేకుండానే పర్యటించడం ఆసక్తికరంగా మారింది. ఎవరెవరితో అజిత్ దోవల్ భేటీ అయ్యారు..? ఈ సమావేశం ఎజెండా ఏంటి..? అనే వివరాలను రహస్యంగా ఉంచారు. దీంతో ఆయన పర్యటన వెనక గట్టి మతలబే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అజిత్ దోవల్ పాకిస్తాన్ లో రహస్యంగా ఉన్నారు.
మారువేషాల్లో భిక్షగాడి వేషంలో గూడచర్యం చేసి దేశానికి కీలక సమాచారం అందించారు. అలాగే, అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ లో తీవ్రవాదులు చొరబడిన సమయంలోనూ రిక్షావాలా వేషమేసి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు భద్రత సిబ్బందికి చేరవేశారు. ఇలా ఆయన ఎన్నో ఆపరేషన్లు లీడ్ చేసి సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా పేరు పొందారు. అలాంటి ఆఫీసర్ ఏ కారణం లేకుండా భద్రతను గాలికి వదిలేసి హైదరాబాద్ లో పర్యటించడం హాట్ టాపిక్ అవుతోంది.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో పీఎఫ్ఐ మూలాలు బయటపడటం, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల నేపథ్యంలో ఆయన హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.