కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న చైనాను మరో వైరస్ మరింత భయపెట్టేస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో కొత్త వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో చైనా సర్కార్ లాక్ డౌన్ పై సమాలోచనలు చేస్తోంది.
ఫ్లూ వైరస్ కట్టడిలో భాగంగా చైనాలోని పలు నగరాల్లో లాక్ డౌన్ విధించాలని జిన్ పింగ్ ప్రభుత్వం ఉన్నతాదికారులతో చర్చిస్తోంది. ఫ్లూ కేసుల కట్టడికి లాక్ డౌన్ విధించడం మాత్రమే మార్గమని… లేదంటే కరోనా తరహలో జనాలు మహమ్మారి ధాటికి విలవిల్లాడటం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులు కరోనా రోగులతో, ఈ ఫ్లూ వైరస్ బాధితులతో నిండిఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త వైరస్ కారణంగా కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రులకు బాధితులు క్యూ కట్టే అవకాశం ఉంది. దాంతో ఆసుపత్రులు మరింత కిక్కిరిసిపోతాయని భావిస్తోన్న ప్రభుత్వం లాక్ డౌన్ విధించాలని భావిస్తోంది.
ఫ్లూ వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం లాక్ డౌన్ విధించాలని నిర్ణయించినట్లుగా వార్తలు వస్తుండటంతో అక్కడి ప్రజలు నిరసనలకు సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. లాక్ డౌన్ కు బదులు అందరికీ వ్యాక్సిన్ లు పంపిణీ చేయాలని కోరుతున్నారు. మార్చి మొదటి వారంలో 25.1శాతంగా నున్న ఫ్లూ కేసులు గత వరం 41.6శాతం పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ వైరస్ కట్టడికి లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు… ప్రపంచ వ్యాప్తంగా విలనిజం చూపిస్తోన్న ఈ ఫ్లూ వైరస్ కట్టడికి భారత్ కూడా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అలర్ట్ గా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.