తెలంగాణ రాజకీయాలు సలసల మసులుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంతో రాష్ట్రంలో ఆధిపత్యం చెలయించాలని బీజేపీ ప్రయత్నించగా…ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బీజేపీ ఆగడాలకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఫలితంగా టీ- పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి.
ఎమ్మెల్యేల ఎరవేతకు కేసుతో బీజేపీ దూకుడును నియత్రించాలనుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీపై యుద్ద ప్రకటనలు చేశారు. ఆ పార్టీ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాల సీఎం లకు, సిజే లకు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులను పంపారు. ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేసి పలువురు కమలనాథులకు నోటిసులు పంపారు. మరికొద్ది రోజుల్లోనే అమిత్ షా కు కూడా నోటిసులు పంపనున్నారని సంకేతాలు ఇస్తున్నారు పోలీసులు.
బీజేపీపై ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోన్న టీఆర్ఎస్ ను సైలెంట్ చేసేలా కేంద్రం రంగంలోకి దిగింది. ఐటీ, ఈడీలు టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా సోదాలు నిర్వహించాయి. గంగుల కమలాకర్, వద్దిరాజ్ రవిచంద్ర, మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించాయి. పలు అవకతవకలు జరిగినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించినట్లు అనధికారిక వర్గాల సమాచారం.
Also Read : టీఆర్ఎస్ కు కష్టకాలమే – ఆందోళనలో ముఖ్య నేతలు
టీఆర్ఎస్ ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టే లక్ష్యంతో సాగుతున్న ఈ దాడులు.. రానున్న రోజుల్లో మరికొంతమందిపై కూడా జరిగే అవకాశం ఉంది. రాజకీయ లబ్ది కోసం బీజేపీతో శత్రుత్వం ఏర్పరుచుకొని తమను కేసిఆర్ బుక్ చేశాడంటూ టీఆర్ఎస్ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఈడీ, ఐటీ రాడార్ లోనున్న మరికొంతమంది నేతలు కూడా బీజేపీతో వైరం పెట్టుకోవడం మంచిది కాదని.. శరణు వేడుకోవడమే మన ముందున్న ఆప్షన్ అని కేసీఆర్ కు చెప్పదల్చుకున్నారని అంటున్నారు.
లిక్కర్ స్కాంలో కవిత పేరును తొలగిస్తేనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దూకుడుకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాని బీజేపీ కవిత పేరును తొలగించే అవకాశం లేదు. టీఆర్ఎస్ , బీజేపీలు ఆధిపత్యం కోసం పాకులాడుతూ నేతలను ఇరకాటంలోకి నేట్టేస్తున్నాయి. బీజేపీ విషయంలో కేసీఆర్ పట్టు విడనంత వరకు రాజకీయ రణంలో ఆ పార్టీ నేతలు బలి కావాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.