క్రియేటివ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ కాంబోలో ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఆదిపురుష్ కథ : జానకి (కృతి సనన్ ), శేషు (సన్నీ సింగ్ )తో రాఘవుడు ( ప్రభాస్ ) అరణ్యవాసానికి వెళ్తాడు. అక్కడ రాఘవుడిని చూసి సూర్పుణఖ( తృప్తి) మనస్సు పారేసుకుంటుంది. ఆయనను తన భర్తగా పొందాలని ఆరాటపడుతోంది. తన మనస్సులోని మాటను రాఘవుడితో పంచుకోగా నాకు వివాహం జరిగిపోయింది. మిమ్మల్ని వివాహమడలేననని సూర్పుణఖకు చెప్పి రాఘవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాఘవుడిని పెళ్లి చేసుకున్నది ఎవరని తెలుసుకొని ఆమెను చంపి, తనను వశం చేసుకోవాలని సూర్పుణఖ ఎత్తుగడ వేసి విఫలయత్నం చేస్తుంది. జానకిని చంపాలని చూసిన సూర్పణఖ ముక్కుకు శేషు వేసిన బాణం తగులుతుంది. దీనిని అవమానంగా భావించిన సూర్పణఖ జరిగిన విషయాన్నీ తన అన్నయ్య లంకేషుడు(సైఫ్ ఆలీఖాన్ ) కు చెప్తుంది. తన చెల్లి మనస్సు పడిన వాడిని ఆమెకు కాకుండా రాఘవుడిని వివాహమాడిన జానకిని అపహరించాలని సాధువు వేషంలో వెళ్లి జానకిని లంకేషుడు అపహరించి లంకకు తీసుకొస్తాడు. ఆ తరువాత జానకి ఆచూకీతోపాటు ఆమెను పొందేందుకు రాఘవుడు ఎలాంటి కష్టాలు అనుభవిస్తాడు..? రాఘవుడు చేసిన యుద్ధం ఏంటి..? తరువాత ఏమైంది..? అనే విషయాలను థియేటర్ లో చూడాల్సి ఉంటుంది.
కథ విశ్లేషణ : రాముడు వనవాసం, సీతను పొందేందుకు రాముడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నది అందరికీ తెలిసిన విషయమే. రామాయణం కథ అందరికీ తెలిసిందే కనుక కథకు దర్శకుడు కాస్త ఆధునికతను జోడించాడు. ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోబెట్టేందుకు ఈ ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. కథలో పెద్ద మార్పులేమీ లేవు కానీ కొన్ని విషయాల్లో మాత్రం కాల్పనికతను జోడించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంలో డైరక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రధానంగా పాత్రల ఎంపిక విషయంలో, గెటప్స్ విషయంలో డైరక్టర్ చాలా శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తుంది.
కొన్ని అంశాలను పూర్తిగా విస్మరించి కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు డైరక్టర్ ప్రయత్నించినట్లు ఫీల్ కల్గుతుంది. ఇక విజువల్స్ మాత్రం వండర్. కాకపోతే కొన్ని సెట్ కాలేదు. త్రీడీ ఎఫెక్ట్ తో కొన్ని బాగున్నాయి.మరికొన్ని బాగోలేవు. వార్ సీన్స్ బాగున్నా సెకండాఫ్ లో మాత్రం వార్ సీక్వెన్స్ లు ఇవ్వలేదు. విజువల్స్ మీద పెట్టిన ఫోకస్ సన్నివేశాలపై పెట్టలేదేమో అనిపిస్తుంది. కొన్ని యాక్షన్స్ సీన్స్ బాహుబలిని గుర్తుకు తెస్తాయి. కథ తెలిసిందే కాబట్టి కథ నిదానంగా కదులుతున్నట్లు అనిపిస్తుంది.
నటీనటుల ప్రదర్శన : రాఘవుడు పాత్రలో ప్రభాస్ పూర్తిగా జీవించేశాడు. ఆయన ఆహార్యం ప్రేక్షకులను మెప్పిస్తుంది. జానకి పాత్రలో కృతి సనన్ కనిపించే సన్నివేశాలు తక్కువే అయినా ఉన్నంతలో బెటర్ ఫెర్ఫామెన్స్ చేసిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సన్నివేశాల్లో కృతి సనన్ ఆదరగోట్టింది. రావణుడి గెటప్ సైఫ్ ఆలీఖాన్ కు సెట్ కానట్టు అనిపిస్తుంది. శేషు( లక్ష్మణుడిగా) సన్నీ సింగ్, హనుమంతుని పాత్రలో దేవదత్త మెప్పించారు.
రేటింగ్ : 2 . 75 /5