తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ సినీ హీరోగా మారబోతున్నారు. ఆయన నటించిన సినిమా త్వరలోనే విడుదల కానుంది. డిబేట్లలో తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తూ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించే దయాకర్ తెరపై ఎలా కనిపిస్తాడో, ఆయన నటన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కాంగ్రెస్ అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది అద్దంకి దయాకర్ నటించిన సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
2014 నుంచి ఇప్పటి వరకు ఎదురైన వరుస పరాజయాలు కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీశాయి. దీంతో చాలామంది నేతలు పార్టీ పని అయిపోయిందని పార్టీని వీడారు. వీరిలో చాలామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోనున్న కాలంలో మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులు , చైర్మన్ పదవులు, పీసీసీ అద్యక్ష పదవులు అనుభవించిన వారే ఉన్నారు. ఇలా సీనియర్ నేతలంతా పార్టీ కష్టకాలంలో ఉందని కాంగ్రెస్ ను వీడినా తెలంగాణ ప్రజల కళను సాకారం చేసిన కాంగ్రెస్ కోసం కమిట్మెంట్ తో పని చేస్తున్నారు అద్దంకి దయాకర్. టీపీసీసీ అధికార ప్రతినిధి అయిన అద్దంకి దయాకర్ టీవీ చర్చలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా వేధికల ద్వారా ఎల్లప్పుడూ పార్టీ వాయిస్ వినిపిస్తూ ఉంటారు. రాజకీయలను పరిశీలించే ప్రతీ ఒక్కరికీ అద్దంకి దయాకర్ పేరు సుపరిచతమే. అయితే ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సినీ హీరోగా మారనున్నారు.
బొమ్మక్ మురళి అద్దంకి దయాకర్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రియల్ లైఫ్ లో ఎలాగైతే కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారో రీల్ లైఫ్ లోనూ అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగానే కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు కూడా అద్దంకి దయాకర్ కావడం మరో విశేషం. ఈ సినిమాలో అద్దంకితో పాటు ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా కలిసి నటిస్తున్నారు. అద్దంకి భార్యగా ప్రముఖ సినీ నటి ఇంద్రజ నటిస్తున్నారు. దాసోజు శ్రవణ్, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే.. ఈ సినిమా తన సెమీ బయోపిక్ గా ఉంటుందని అద్దంకి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బయో వార్, దేశాల మధ్య వివాదాలతో పాటు అనేక సామాజిక అంశాలు ఈ సినిమాలో మిళితమై ఉంటాయన్నారు అద్దంకి. కొన్ని ఫైట్లతో పాటు ఓ పాట కూడా ఉంటుందని తెలిపారు. యంగ్ పొలిటీషియన్ తాను ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి ఛాలెంజ్ లను ఎదుర్కొంటాడన్న విషయాలు ఈ సినిమాలో ఉంటాయన్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతల అనుమతితో గాంధీ భవన్ లో కూడా చిత్రించారు. అద్దంకి దయాకర్ ప్రెస్ తో మాట్లాడే సన్నివేశాలను గాంధీభవన్ లో చిత్రీకరించారు. అయితే ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రస్తుతం నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే టీ- జాక్ లో కీలకంగా పని చేసిన అద్దంకి రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతూర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో గాదరి కిషోర్ పై ఓటమి చెందారు. అనంతరం 2018లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా తుంగతుర్తి నుంచి పోటీ చేసి 2 వేల ఓట్ల స్వల్ప తేడాతో మళ్లీ ఓడిపోయారు. మరో సారి తుంగతుర్తి నుంచే పోటీ చేసి మూడో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అద్దంకి దయకర్ భావిస్తున్నారు. ఈసారి తన గెలుపును ఎవరూ ఆపలేరన్న ధీమాతో ఉన్నారు అద్దంకి దయాకర్.