ఈ వారం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలపై విశ్లేషణ చేశారు. కేసీఆర్ రాజకీయ విశ్వసనీయత పట్ల ప్రజల్లో హేయభావం కల్గేలా రాసుకొచ్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణపై దృష్టిసారించిన కేసీఆర్.. అక్కడ అవకాశమొస్తే సీఎం పదవి చేపడుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రమేర్పడితే దళితుడే సీఎం అవుతాడని ప్రకటించిన కేసీఆర్ ఆ సామజిక వర్గానికి సీఎం పదవి ఎందుకివ్వరని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రమేర్పడిన తరువాత దళితుడ్ని సీఎం చేయకపోవడానికి కారణం..నూతన రాష్ట్రమైన తెలంగాణను కాపాడుకోవడం కోసమేనని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు. కనుక, సీఎం పదవి ఇప్పటికైనా దళితులకు ఎందుకు ఇవ్వరని లాజిక్ తో కూడిన ప్రశ్నను లేవనెత్తారు. తన తరువాత సీఎం చైర్ లో కేటీఆర్ ను కూర్చోబెట్టేందుకు కేసీఆర్ వ్యవహారాలన్నింటిని చక్కబెడుతున్నారని ఆర్కేకు స్పష్టత ఉంది. అందుకే కేటీఆర్ కు సీఎం చైర్ అందకుండా దళిత సీఎం హామీని తాజాగా తెరపైకి తీసుకొచ్చారు.
ఇటీవల కేసీఆర్ కొత్త, కొత్త డైలాగ్ లు కొడుతున్నారు. ఓ వైపు నీతి వాక్యాలు వల్లిస్తూనే నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారనేలా కొత్త పలుకులో ఆర్కే రాసుకొచ్చారు. కేసీఆర్ ను నమ్మి తెలంగాణ ప్రజలు ఆయన్ను సీఎం చైర్ లో కూర్చోబెడితే వారెం పాపం చేశారని ఇలా గోసపుచ్చుతున్నారని ఆవేదన చెందారు. పాప ప్రక్షాళన జరగాలని, కేసీఆర్ ను ఓడించాలనేలా తెలంగాణ ప్రజలను అభ్యర్థించారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ కు ఫేవర్ గా ఉన్న ఆర్కే ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ టార్గెట్ గా విశ్లేషణలు చేస్తున్నారు.
Also Read : సంచలన కథనం : కేసీఆర్ అక్రమాల చిట్టాను బయటపెట్టిన ఏబీఎన్ ఆర్కే