ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీని గద్దె దించుతామని ప్రకటిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వాల ఏర్పాటుకు విపక్షాలన్నీ ఏకం కావాలని ఖమ్మం సభలో కేసీఆర్ పిలుపునిచ్చారు.
అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్ ఆసీనులైన వేదిక నుంచే కేసీఆర్ ఈ పిలుపు ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో మరో కొత్త చర్చ జరుగుతోంది. దాదాపుగా వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో కొన్ని స్థానాల్లో కమ్యూనిస్టుల అవసరం ఎలాంటిదో కేసీఆర్ కు తెలిసి వచ్చింది. దాంతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కొన్ని స్థానాలను పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించనున్నారు. అందుకే కమ్యూనిస్టులు రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ తో.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు.
ఇదంతా బాగానే ఉన్నా.. అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ సభలు, సమావేశాలకు హాజరు కావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ పార్టీకి తెలంగాణలో పెద్దగా క్యాడర్ లేదు. పేరు మోసిన నేతలు కూడా ఎవరూ లేరు. గతంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగిన ఇందిరా శోభన్ ప్రస్తుతం ఆమ్ ఆద్మీ తెలంగాణ శాఖలో కీలక నేతగా ఉన్నారు. సీపీఐ పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహించిన డాక్టర్. సుధాకర్ కూడా ఆప్ లోనే ఉన్నారు. వీరు తప్ప ఫేమ్ ఉన్న నేతలెవరూ ఆ పార్టీలో లేరు. వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాలు ఆమ్ ఆద్మీకి కేటాయించి జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ మద్దతును కూడగట్టుకోవాలని కేసీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ ఉనికి, బలోపేతం దృష్ట్యా కేసీఆర్ తో కలిసి నడిస్తే ఉపయుక్తంగా ఉంటుందని అరవింద్ కేజ్రీవాల్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే.. ఇందిరా శోభన్ ముషీరాబాద్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముఠా గోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను కాదని..పొత్తులో భాగంగా ఇందిరా శోభన్ కు అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.