తెలంగాణ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరులో అధికారులపై ఓ యువకుడు పెట్రోల్ పోసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఎస్సై, తహసీల్దార్ తప్పించుకోగా, ఎంపీవో గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేయడంతో ప్రాణాపాయం తప్పింది. పెట్రోల్ స్ప్రే చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
దారి వివాదం – పెట్రోల్ తో దారుణం
దారి వివాదం తలెత్తడంతో.. అదే గ్రామానికి చెందిన యువకుడు గంగాధర్, రోడ్డుకి అడ్డంగా కర్రలు, ఇటికలు పెట్టాడు. స్థానికులు వారించినా వినిపించుకోలేదు. దీంతో గ్రామస్తులు అధికారులకి ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించేందుకు ఎస్సై, తహసీల్దార్, ఎంపీవో గ్రామానికి వచ్చారు. కర్రలు, ఇటికలు తొలగించేందుకు ప్రయత్నించారు. గంగాధర్ ముందుగానే పెట్రోల్ తో నింపిన స్ప్రేయర్ తీసుకొని.. అధికారులపై స్ప్రే చేశారు. ఈ క్రమంలో ఎస్సై ప్రతిఘటించి అడ్డుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో గంగాధర్ నిప్పంటించాడు. ఎస్సై అక్కడి నుంచి పక్కకు పరిగెత్తారు. పక్కనే ఉన్న ఎంపీవో రామకృష్ణరాజుకు మంటలు అంటుకోవడంతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు ఆయనపై నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. అప్పటికే గాయాలైన ఎంపీవోను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అధికారులపై పెట్రోల్ స్ప్రే చేసిన గంగాధర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.