వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున కొల్లాపూర్ టికెట్ ను ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు. రంగినేని అభిలాష్ రావు, చింతలపల్లి జగదీశ్వర్ రావు మరియు డా. కేతూరి వెంకటేష్ లు కోరుతున్నారు. బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని భావిస్తే ఖచ్చితంగా కేతూరి వెంకటేష్ కు అవకాశం దక్కుతుంది. ఆర్ధిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రంగినేని అభిలాష్ రావు ,చింతలపల్లి జగదీశ్వర్ రావులలో ఒకరికి అవకాశం దక్కొచ్చు.
డా. కేతూరి వెంకటేష్ విద్యార్ధి ఉద్యమ నాయకుడు. బీసీ సామజిక వర్గానికి చెందిన నేత. ఎన్ఎస్ యూఐ , యూత్ కాంగ్రెస్ విభాగాల్లో పని చేసిన కేతూరికి సీనియర్ నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. జాతీయ స్థాయి నేతలతో కేతూరికి సాన్నిహిత్యం ఉంది. రాష్ట్ర స్థాయిలోనూ మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కీ వంటి సీనియర్ నేతలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. పైగా.. నియోజకవర్గంలో పని చేసుకోవాలంటూ కేతూరికి సీనియర్లు ఫ్రీ హ్యండ్ ఇచ్చారు. ఇదే ఊపులో ఆయన జోడో యాత్రకు పూర్వం నియోజకవర్గం అంత కలియతిరిగారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి ఆయనకు పరిచయాలు ఉండటం కేతూరికి కలిసొచ్చే అంశం. పైగా.. ఇటీవల భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీతో సన్నిహితంగా మెదిలారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కడం ఖాయమని ఆయన ఆశాభావంతో ఉన్నారు.
ఓయూ విద్యార్ధి నేతలకు 2018ఎన్నికల్లోనే పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. పలు కారణాల వలన అప్పుడు విద్యార్ధి నేతలకు టికెట్ ఇవ్వలేకపోయారు. దాంతో ఈసారి విద్యార్ధి ఉద్యమకారులకు టికెట్లు ఇస్తారని కేతూరి భావిస్తున్నారు. పైగా.. ఐదు దశాబ్దాల నుంచి కొల్లాపూర్ లో అగ్రవర్ణాలకు చెందిన వారికీ టికెట్లు ఇస్తున్నారని.. ఈసారైనా బీసీ సామజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు కేతూరి వెంకటేష్. ఈ క్రమంలోనే.. కేతూరి వెంకటేష్ కు పోటీగా రంగినేని అభిలాష్ రావు, చింతలపల్లి జగదీశ్వర్ రావులు కూడా దూకుడు పెంచుతున్నారు. మాకంటే మాకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. క్యాడర్ ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి.. ఈ ముగ్గురి నేతల్లో ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి.
Also Read : కల్వకుంట్ల ఫ్యామిలీలో కొట్లాటలు – నెక్స్ట్ సీఎం పగ్గాలు ఎవరికి…?