హైదరాబాద్ లో నాలుగేళ్ల పసివాడు వీధికుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రతి ఒక్కరి మనస్సును తీవ్రంగా కలచివేస్తోంది. సీసీ కెమెరా దృశ్యాలు చూసిన వారందరూ ఆ పిల్లాడు అనుభవించిన నరకయాతన తలచుకొని వీడియోను చూడటం పక్కన పెట్టేస్తున్నారు. ఓ మాంసపు ముద్ద దొరికినట్లుగా వీధికుక్కలు ఆ బాలుడిపై చెలరేగిపోయాయి. చుట్టూ నాలుగు కుక్కలు ఒకదాని వెనక ఒకటి ఆ పసివాడిపై ఎగబడి పీకుతింటున్న దృశ్యాలు చూసి కంటతడి పెట్టని మనషులు ఉంటారా..?
హైదరాబాద్.. ప్రపంచ ప్రఖ్యాత నగరం. ఎంత అభివృద్ధి ఉంటుందో నగరం లోపలికి వెళ్లి చూస్తె అంతేమొత్తంలో దారిద్ర్యం కేంద్రీకృతమై కనిపిస్తోంది. నగరంలో ఉండే ఎనభై శాతం జనాభా ఈ స్థితిలోనే ఉంటుంది. అతి తక్కువ జీవితాలతో .. అరకొర వసతులతో బతికేస్తూ ఈ ఎనభై శాతం మంది ఉంటారు. ఇలాంటి ప్రాంతాల్లోనే ఈ దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సౌకర్యాలు కల్పించమని ఎవరూ అడగరు..ఎలాగోలా జనం సర్దుకుపోతారులే అనే విధంగా సర్కార్ కూడా ఈ కాలనీలను పట్టించుకోదు. అదే అసలు విషాదం. తరుచుగా ఇలాంటి ప్రాంతాల్లోనే ఈ దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
హైదరాబాద్ ను మేము బాగా డెవలప్ చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు.కానీ ఇంత అబివృద్ది చెందిన నగరంలో ఓ పసివాడు వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం ఏ అభివృద్ధికి సంకేతం..? ఇప్పుడు అభివృద్ధికి కొత్త నిర్వచనం వెతుక్కోవాలేమో. వీధి కుక్కలు లేకుండా ఉంటాయా..అని వితండ సమాధానం చెబితే అది మనల్ని మనం కించపర్చుకున్నట్లే. ఆ పిల్లాడి ప్రాణానికి విలువ ఇవ్వనట్లే. కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన పిల్లవాడు చేసిన తప్పేమీ లేదు. ఆ బిడ్డను పని చేసే చోటుకు తీసుకొచ్చిన తండ్రిది తప్పేమీ లేదు. కానీ తప్పు ఎవరిదీ..?
వీధి కుక్కల్ని నిర్మూలించమని ఎవరూ అనడం లేదు. కానీ వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఈ ఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడిన మాటలు చూస్తె మానవత్వం ఉన్న ఎవరికైనా కోపం రాక మానదు. ఎంత బాధ్యతరహితంగా మాట్లాడారంటే…ఇంత విషాద సమయంలోనూ ఆమె అలా మాట్లాడటం సరైంది కాదు. బిడ్డలున్న ఎవరిని పొదివి పట్టుకునేంత భయంకరంగా సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నాయి. ప్రతిసారి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ తరహ ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకుంటామని చెప్పడం పాలకులకు అలవాటు అయింది. ఇప్పుడు మేయర్ అదే చెబుతున్నారు. కేటీఆర్ అదే చెబుతున్నారు. చూడాలి మరి.. రానున్న రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలకు అడ్డుకట్ట పడుతుందో.