వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కుమారులకు టికెట్లు ఇప్పించుకునేందుకు అప్పుడే పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ వారసులకు ప్రత్యేకంగా ఓ కోటరీని ఏర్పాటు చేస్తున్నారు. పలు ఈవెంట్లు నిర్వహిస్తూ ప్రజలకు, ముఖ్యంగా యువతకు దగ్గరయ్యేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు తలసాని తన కొడుకుకు మరోసారి సికింద్రాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటే.. మల్లారెడ్డి మాత్రం అల్లుడిపై కేసీఆర్ కరుణ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని పోటీ చేయించేందుకు తెరవెనక పావులు కదుపుతున్నారట.
మైనంపల్లి రోహిత్ ను 2023 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని మైనంపల్లి హన్మంతరావు కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ దిశగా ఆయన మెదక్ నియోజకవర్గ ప్రజలకు సంకేతాలు కూడా పంపుతున్నారని అంటున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యేగానున్న మైనంపల్లికి మెదక్ నియోజకవర్గంతో ఎలా సత్సంబంధాలు ఉంటాయని ఆశ్చర్యపోకండి. గతంలో టీడీపీలో కొనసాగిన సమయంలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో హన్మంతరావు గెలుపొందారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిధర్ రెడ్డిపై 21,151 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈ నియోజకవర్గం ఇప్పుడు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైంది. దాంతో మైనంపల్లికి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా మంచి పట్టుందని అర్థం అవుతోంది.
తెలంగాణ ఏర్పాటు తరువాత 2014ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హన్మంతరావు ఓటమి పాలయ్యారు. దాంతో ఆయన సేవలను వినియోగించుకోవాలని హన్మంతరావుకు ఎమ్మెల్సి పదవిని కట్టబెట్టారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. బీఆర్ఎస్ అధిష్టానంతో మైనంపల్లికి మంచి ర్యాపో ఉంది. అదే సన్నిహిత సంబంధాలతో తన కొడుక్కి వచ్చే ఎన్నికల్లో మెదక్ సీట్ ఇప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇందుకోసం ఇప్పటి నుంచే మైనంపల్లి రోహిత్ ను మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పరిచయాలు పెంచుకోవాలని, ప్రత్యేకంగా ఓ అభిమానగణాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారట. అయితే, మెదక్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పద్మ దేవేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెదక్ జిల్లా సీనియర్ మంత్రి హరీష్ రావు అండదండలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. ఆమెను కాదని రోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఇవేం పట్టించుకోకుండానే రోహిత్ రెడ్డి పర్యటనలు చేస్తున్నారంటే.. మైనంపల్లి వెనక కేటీఆర్ ప్రోత్సాహం ఏమైనా ఉందా కోణంలో చర్చిస్తున్నారు.
మెదక్ నియోజకవర్గంలో పద్మ దేవేందర్ రెడ్డికి సమాచారం లేకుండా బీఆర్ఎస్ తరుఫున మైనంపల్లి రోహిత్ పర్యటించడం, పలు దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం, విగ్రహాలకు ఆర్ధిక సాయం వంటివి చేయడం పట్ల పద్మ దేవేందర్ రెడ్డి సీరియస్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైనంపల్లిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు పద్మ దేవేందర్ రెడ్డి రెడీ అయ్యారని అంటున్నారు.