హన్మకొండలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై బీఆర్ఎస్ గుండాలు దాడికి పాల్పడ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీటింగ్ ముగిసిన అనంతరం పవన్ ఇంటికి వెళ్తుండగా.. అతన్ని అడ్డగించి దాడి చేశారు. పదుల సంఖ్యలో పవన్ కోసం కాపుకాసి మరీ ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. విచక్షణరహితంగా దాడి చేయడంతో పవన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న పవన్ ను ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇదంతా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరుల పనేనని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
తోట పవన్. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తుంటాడు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగడాలను సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రశ్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ ను పార్టీ మారాలని ఎన్నోసార్లు బీఆర్ఎస్ నాయకులు ప్రలోభపెట్టారు అయినప్పటికే కాంగ్రెస్ లోనే కొనసాగుతూ ఎమ్మెల్యే దుర్మార్గాలను నిత్యం ఎండగడుతున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న బీఆర్ఎస్ నాయకులు తోట పవన్ ను చంపుతామని ఎన్నోసార్లు బెదిరించారు. కానీ పవన్ మాత్రం ఎమ్మెల్యే వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్ళే పని మాత్రం ఆపలేదు.
ఈ క్రమంలోనే పవన్ పై దాడి చేయాలని ప్లాన్ చేశారు. పవన్ ఎటు వెళ్తున్నాడని ముందుగా తెలుసుకొని.. సోమవారం రాత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ ముగిసిన తరువాత పవన్ ఇంటికి వెళ్తుండగా బీఆర్ఎస్ గుండాలు దాడికి పాల్పడ్డాయి. సినీ ఫక్కీలో అతని లాకొచ్చి మరీ పిడిగుద్దులు, కర్రలతో చావబాదారు. ఆ దెబ్బలకు తాళలేక క్షణాల్లోనే పవన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడంతో బీఆర్ఎస్ గుండాలు అక్కడి నుంచి ఉడాయించాయి. రక్తపుమడుగులో పడిఉన్న పవన్ ను ఆసుపత్రికి తరలించాలంటే స్థానికులు భయంతో వనికిపోయారంటే.. స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగడాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. తోట పవన్ ను కాపాడితే ఎమ్మెల్యే తమను ఏమైనా చేస్తాడెమోనని మానవత్వాన్ని మరిచి అక్కడున్న స్థానికులు చోద్యం చూశారు. చివరికి పవన్ ను కొంతమంది అంబులెన్స్ సహయంతో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.
కాసేపటి క్రితం పవన్ ను టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయనపై దాడి గురించి విషయాలపై ఆరా తీశారు. పవన్ పై దాడికి పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.