కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ నెల 16న గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సాయన్నను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. సాయన్న మృతదేహాన్ని అశోక్ నగర్ లోని వారి నివాసానికి తరలించారు.
టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన సాయన్న ఐదు సార్లు ఎమ్మేల్యేగా గెలుపొందారు. 1994,1999, 2004, 2014, 2018 ఇలా ఆయన వరుసగా గెలుపొందారు. 2009లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు.
2014 లో టీడీపీ తరుఫున ఎమ్మేల్యేగా ఎన్నికైన సాయన్న ఆ తరువాత టీఆరెఎస్ గూటికి చేరారు. 2018లో కారు గుర్తుపై పోటీ చేసిన సాయన్న గెలుపొందారు. వివాదరహితుడిగా ముద్రపడిన సాయన్న ప్రజలకు అందుబాటులో ఉంటారని పేరుంది.అదే ఆయన్ను తిరుగులేని నాయకుడిగా మార్చింది. ఇకపోతే సాయన్న మృతిపై బీఆర్ఎస్ శ్రేణులు సంతాపం ప్రకటించారు.