22రోజులపాటు చావుతో పోరాడి ఓడిపోయాడు నందమూరి తారకరత్న. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తిరిగి మామూలు మనిషిలా మళ్లీ వస్తాడని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీరని శోకాన్ని మిగుల్చుతూ తారక రత్న సెలవు తీసుకున్నాడు.
నారా లోకేష్ చేపట్టిన ‘ యువగళం ‘ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో అతన్ని వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు . ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూర్ నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన తారకరత్నను స్పృహలోకి తీసుకొచ్చేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. విదేశాల నుంచి న్యూరో వైద్యులను రప్పించారు వారి పర్యవేక్షణలో వైద్యం కొనసాగింది. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
కార్డియాలజిస్ట్, న్యూరో స్పెషలిస్టులు తమ అనుభవాన్ని మొత్తం వెచ్చించి వైద్యం అందించినా తారకరత్న మళ్లీ స్పృహలోకి రాలేదు. 22రోజులపాటు మృత్యువుతో పోరాడి నేడు కన్నుమూశాడు. ఆయన లేరన్న వార్తతో నందమూరి కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇప్పటికే బెంగళూరులోని నారాయణ హాస్పిటల్స్ కి నందమూరి కుటుంబ సభ్యులందరూ చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు కూడా చేరుకున్నారు.. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన తారకరత్న పెద్దగా సక్సెస్ లను చూడకపోయినప్పటికీ వ్యాపార రంగంలో గొప్పగా రాణించారు..ఆ తర్వాత ఇటీవలే కాలంలో తెలుగు దేశం పార్టీ లో అధికారికంగా జాయిన్ అయ్యాడు.. గుడివాడ నుండి పోటీ కూడా చేద్దాం అనుకున్నాడు..అలా తన రాజకీయ భవిష్యత్తుని ప్రారంభించిన తారకరత్న ఇలా అకస్మాత్తుగా మరిణించడం బాధాకరం.