మనిషికి మనిషి శత్రువు ఎప్పుడో అయ్యాడు. ప్రేమ సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి. బయటకు చెప్పడం లేదు కానీ ప్రతి మనిషి మధ్య ఉన్నది కేవలం ఆర్ధిక సంబంధమే. ప్రపంచీకరణ మనుషుల మధ్య అనుబంధాన్ని కత్తిరించింది.ఫలితంగా మనిషికి మనిషి అవసరాలను తీర్చే వస్తువు అయ్యాడు. సాటి మనిషిని ప్రేమించడం, అభిమానించడం అమయాకత్వం అయిపొయింది.
మనిషికి మనిషి మధ్య పెనవేసుకుపోతున్న బంధాలు కృత్రిమం అవుతున్న సమయనా..మానవీయతకు అద్దం పట్టిన ఓ చిత్రం సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తల్లిలాగా ఆదరించాల్సిన కోడలు, కాలికి మట్టి అంటకుండా పెంచి పెద్దచేసిన తల్లి పట్ల కొడుకు కర్కశంగా వ్యవహరించారు. చీకొట్టి వృద్ధాశ్రమంలో ఆ వృద్దురాలిని బందీ చేస్తే…చాలా కాలం తరువాత యాక్సిడెంటల్ గా తన చిన్నతనంలో అల్లారుముద్దుగా పెంచిన నాన్నమ్మ కంటపడితే..? ఆ చిట్టితల్లి ఊరుకుంటుందా..? వెంటనే వెళ్లి గుండెలకు హత్తుకుంది. తన ఒడిలో తలవాల్చి ఏకధాటిగా ఏడ్చింది. ఊరుకో తల్లీ అని వారిస్తున్నా.. ఆపకుండా విలపించింది.
స్కూల్ టూర్లో భాగంగా వృద్ధాశ్రమంలోకి వెళ్తే అక్కడ వాళ్ల నానమ్మ కనిపించింది. ఇన్నిరోజులు తన నానమ్మ ఎక్కడుంది అనుకుందో, తన తల్లిదండ్రులు ఆ చిన్నారికి ఏమని చెప్పుకున్నారో తెలియదు కానీ నాన్నమ్మను చూడగానే ఉన్నపళంగా వెళ్లి గుండెలకు హత్తుకుంది. తనివితీరా ఏడ్చింది. ఇన్నాళ్ళు తనను విడిచి ఇక్కడ ఎందుకున్నావని ధారగా కారుతున్నా కన్నీటిని ఆపు కుంటూ నిలదీసింది. మనవరాలికి ఏం చెప్పాలో తెలియక తను ఏడ్చింది.
కొడుకు, కోడలిని దోషిగా చెప్పడం ఇష్టం లేక నిందను తనే మోసింది. ఎంతైనా కన్నపేగు కదా. దోషిగా తను మారి నిర్దోషిత్వాన్ని కొడుకు, కోడలికి ఇచ్చింది. ఆ మనవరాలి, నాన్నమ్మల సంభాషణ, ఆ దృశ్యాలను చూసి అక్కడున్న వృద్దులు, స్కూల్ పిల్లలు కన్నీటిని ఆపుకోకుండా ఏడ్చేశారు. వారిని ఓదార్చడం అక్కడున్న వారి వలన కాలేదంటే..ఆ చిట్టితల్లి నాన్నమ్మ ప్రేమను ఎంత మిస్ అయి ఉంటుంది..? తల్లిదండ్రులు పంచని ప్రేమోదో ఆ చిన్నారికి వాళ్ళ నాన్నమ్మ పంచి ఉండబట్టే కదా.